calender_icon.png 27 November, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయాలు తెలిపేందుకే ఉత్సవాలు

27-11-2024 12:00:00 AM

  1. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ హామీల అమలు 
  2. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  3. మంథనిలో ప్రజాపాలన విజయోత్సవ సభ

మంథని, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గత సంవత్సర కాలంలో సాధించిన విజయాలను చాటి చెప్పేందుకే విజయోత్సవాలను నిర్వహిస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం మంథనిలో నిర్వ హించి న ప్రజాపాలన విజయోత్సవ సభను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు.

అంతకుముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో షూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో సంవత్సర కాలంలో మహిళలు రూపాయ ఖర్చు పెట్టకుండా ఉచితంగా ప్రయాణిస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామ న్నారు.

పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సరఫరా, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వరకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అమలు చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. 10 నెలల కాలంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు విజయోత్సవాలు చేస్తున్నామని స్ప ష్టం చేశారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా అడవి సోమనపల్లి ప్రాంతంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా సమీకృత గురు కుల నిర్మాణ పనులు చేపట్టామని మంత్రి గుర్తు చేశారు. పెద్దపల్లి జిల్లాలో బోనస్ కింద ఇప్పటివరకు రూ. 20 కోట్ల పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు.

గతంలో తరుగు పేరిట రైతు లు పడిన బాధను శాశ్వతంగా పరిష్కరిస్తూ మద్దతు ధరపై ఎటువంటి తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు 17వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.236 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని అన్నారు.

గత ప్రభుత్వం మాదిరిగా గుట్టలకు, రోడ్లకు కాకుండా అసలైన రైతులకు, కౌలు రైతులకు లబ్ధి చేకూర్చేలా త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని మంత్రి తెలిపారు. 

మంథనిలో స్పష్టమైన మార్పు 

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంథనిలో స్పష్టమైన మార్పు కనిపించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాలు పని చేస్తానని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. వాణిజ్య వ్యాపారాలు విస్తరించే విధంగా మంథని, మంచిర్యాలను కలుపుతూ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు.

మంథని పట్టణానికి బైపాస్ రోడ్డు, 13 వార్డుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మంథని పట్టణంలో 40 మంది యువకులకు ఉపాధి కల్పిస్తూ చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించామని, భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

రామగిరి క్షేత్రాన్ని రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తామని, మంథని పట్టణం సమీపంలో గల గోదావరి నది పుష్కరాల నిర్వహణకు రూ.రెండు కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 150 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతూ చిన్న ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని, దీనికి అవసరమైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

బహుళ జాతి కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు మన యువతకు అందించే దిశగా నైపుణ్య కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. మంథని పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నరేగా ద్వారా నిర్మాణం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. అంతడుపుల నాగరాజు సారధ్యంలోని కళాబృందం చేసిన ప్రదర్శ నలు ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో  మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ రమాదేవి, వైస్ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మండలాధ్యక్షుడు ఐలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్‌రెడ్డి, మంథని ఆర్డీవో సురేష్ పాల్గొన్నారు.