13-12-2024 01:10:45 AM
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 12 (విజయక్రాంతి): నగరంలో న్యూ ఈయర్ వేడుకలకు రాత్రి ఒంటిగంట వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31వ తేదీన ప్రత్యేక వేడుకలు నిర్వహించే హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లకు పలు మార్గదర్శకాలను జారీచేశారు.
ఈ మేరకు గురువారం సీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. న్యూ ఈయర్ ఈవెంట్స్ నిర్వహించేవారు 15 రోజుల ముందే సీపీ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించి, అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్ జరిగే ప్రదేశాలతో పాటు పార్కింగ్ ప్రదేశాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పార్టీలకు వచ్చే మైనర్లకు మద్యాన్ని సరఫరా చేయొద్దని, పార్టీల్లో ఎలాంటి మాదకద్రవ్యాలను ఉపయోగించరాదని హెచ్చరించారు. డిసెంబర్ 31న సాయంత్రం 6గంటల నుంచే డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే ఎంవీఐ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామని సీపీ స్పష్టం చేశారు.