- రైతు రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు
- సంబురాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- బ్యాంకులో నగదు జమపై కలెక్టర్లు, అధికారుల మోనిటరింగ్
విజయక్రాంతి, నెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి చూపించామని కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్షలోపు రుణాలకు సంబంధించి గురువారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేసిన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సంబురాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించామని.. ఆగస్టు 15లోపు రూ.2లక్షల లోపు రుణాలను కూడా మాఫీ చేసి చూపిస్తామని నేతలు స్పష్టం చేశారు.
రుణమాఫీ ఎప్పుడు, చేస్తారా, చేయరా అని మాట్లాడిని ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. జిల్లాలవారీగా కలెక్టర్లు రుణమాఫీ ప్రక్రియను మోనిటరింగ్ చేశారు. రైతుల ఖాతాల్లో నగదు జమచేయడంతో ఏమైనా ఇబ్బందులు ఉంటే అప్పటికప్పుడు సరిచేశారు. అర్హత ఉన్నా ఖాతాల్లో నగదు జమకాని రైతుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో ఓ మహిళా రైతు వీడియో కాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడుతూ.. రేవంత్ అన్నా .. నాకు ఎకరం పొలం ఉంది. సాగుపనుల కోసం బ్యాంకులో రూ.60వేలు అప్పుచేశాను. ఎన్నికల ముందు మీరిచ్చిన మాట ప్రకారం నా రుణం మాఫీ చేశారు. థ్యాంకూ అన్నా అనడంతో.. వేదికపై ఉన్న జూపల్లితో పాటు కాంగ్రెస్ నేతలందరూ జై రేవంత్..జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
సంబురాల్లో ప్రముఖులు..
నల్లగొండలో నిర్వహించిన రుణమాఫీ సంబురాల్లో పాల్గొన్న కోమటిరెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్‌గాంధీ రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాయంపేటలో ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో నేతలు సంబురాలు జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు ఎడ్ల బండిపై జుక్కల్ నియోజకవర్గంలోని డోన్‌గావ్‌లో రుణమాఫీ సంబురాల్లో పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావును రైతులు నాగలితో సన్మానిం చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం, కామారెడిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ఆలీ, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేంసాగర్, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్, చిట్యాలలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాల గూడలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మోతె రైతువేదికలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.