25-02-2025 04:40:17 PM
మునగాల: కోదాడ నియోజకవర్గం మునగాల విద్యార్థులు అన్వేషణ ద్వారా తమలోని సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చని మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల్లో భాగంగా మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం నేతృత్వంలో నిర్వహించిన మునగాల విజ్ఞానోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రయోగపూర్వకంగా స్వయంగా తెలుసుకున్న విషయాలు పూర్తి విజ్ఞానాన్ని అందిస్తాయని ఆయన అన్నారు.
మండల విద్యాశాఖ సౌజన్యంతో, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం భాగస్వామ్యంతో ఆద్యంతం అట్టహాసంగా నిర్వహించిన ఈ సైన్స్ దినోత్సవ వేడుకల్లో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన చిన్నారులు 76 సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారని సైన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ళమూడి రమేష్ బాబు తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఎగ్జిబిట్స్ తో పాటు నృత్యరూపకాలు కూడా అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ విజ్ఞాన ఉత్సవంలో చక్కని ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రశంసా పత్రాలను, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత విశ్రాంత ఉపాధ్యాయులు వల్లపట్ల దయానంద్, రిటైర్డ్ ప్రిన్సిపల్ అర్వపల్లి శంకర్ సైన్సు గణిత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.