చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం..
మందమర్రి (విజయక్రాంతి): వసంత పంచమిని పురస్కరించుకొని పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. సోమవారం పాఠశాల ఆవరణలో శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు తమ చిన్నారులను తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఆచార్యులు కట్ట శిరీష, కార్యదర్శి దాసరి రాములు మాట్లాడుతూ... విద్యతోనే ప్రగతి సాధ్యమని, గత 50 సంవత్సరాలుగా వసంత పంచమి రోజున శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
సరస్వతీ దేవికి అంకితం చేయబడిన వసంత పంచమి పుణ్యదినం రోజున తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలని చాలామంది ఆశపడతారని, చిన్నారులకు ఓనమాలు దిద్దించి వారి చదువుకు మొదటి అడుగు వేయించడం జరిగిందని, ప్రతి సంవత్సరం పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం చేపడతామని, పిల్లలకి సరస్వతీ దేవి సంపూర్ణ కటాక్షం కలగాలని అమ్మ వారిని ఈ సందర్భంగా వేడుకున్నారు. వేద పండితులు చిన్నారుల చిట్టి చేతులతో అక్షరాలు దిద్దించారు. చిన్నారుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంతో సరస్వతి శిశు మందిర్ పాఠశాల చిన్నారులతో సందడిగా మారింది. అనంతరం తీర్థ ప్రసాదాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఆచార్యులు కట్ట శిరీష, కార్యదర్శి దాసరి రాములు, అధ్యక్షులు బండారి సూరిబాబు, ఆచార్య శ్రీజ, మాస్టర్ రమేష్ రాజా, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.