calender_icon.png 2 November, 2024 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా కోరల్లో సీలింగ్ భూములు

16-07-2024 01:34:35 AM

  • సీలింగ్ భూములను రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు 
  • మజీద్‌పూర్‌లో 18 ఎకరాల భూమి కోసం రైతుల పోరాటం

అబ్దుల్లాపూర్‌మెట్, జూలై 15: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, భూదాన్, సీలింగ్, అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. మజీద్‌పూర్‌లో పేద రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూములను అక్రమార్కులు కబ్జా చేసి విక్రయించుకున్నారు. సీలింగ్ భూములను ఇతరులకు పట్టా చేయడం నిషేధమని తెలిసినా అధికారులు కబ్జాదారుడికి కొమ్ముకాశారు. భూమిపై కన్నేసిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అధికారుల సాయంతో తన పేరు పై రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇతరులకు విక్రయించాడు.

మా భూమి మాకే ఉందని ధీమాగా ఉన్న రైతులకు నిజం తెలిసి నివ్వెరపోయారు. మజీద్‌పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 1969లో ఉమ్మడి ఏపీగా ఉన్నప్పుడు ఏపీకి చెందిన రాజన్‌రాజు, ప్రభావతి, బుచ్చి వెంకటయమ్మ, వెం కటపతి రాజు  వివిధ సర్వే నంబర్లలో 243.30 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. 1973లో అప్పటి ప్రభుత్వం సీలింగ్ యాక్ట్ (ఒకే కుటుంబానికి పరిమితికి మించి గరిష్టం గా భూములు ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం) తెచ్చింది.  దీంతో రాజన్‌రాజు, ప్రభావతి, బుచ్చి వెంకటయమ్మ, వెంకటపతి రాజు తమ మిగులు భూమిని ప్రభుత్వానికి అందజేశారు. భూస్వాముల నుంచి తీసుకున్న భూమిని పేదలకు ఇచ్చి, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి భూ హక్కు పత్రాలను అప్పటి ప్రభుత్వం ఇచ్చింది.

కోట్లలో విలువ ఉండడంతో..

మజీద్‌పూర్‌లో దాదాపు 243.30 ఎకరాల సీలింగ్ భూమిని 143 మందికి రైతు లకు ప్రభుత్వం 243.౩0 లో పంపిణీ చేసి సర్టిఫికెట్లు అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో కొండలు, గుట్టలు ఉండడంతో రైతులు సాగు చేయలేదు. కొంత కాలం తర్వాత 126 మంది తమ భూమిని సాగు చేసుకొని పొజిషన్‌లో ఉన్నారు. కానీ, 17 మంది రైతులు భూమిని పడావు పెట్టారు. భూములకు కోట్లలో విలువ పెరగడంతో ఈ 17 మందికి చెందిన 18 ఎకరాల సీలింగ్ భూమిని స్థానిక నాయకుడు తన పేరుపై మార్చుకొని ఇతరులకు విక్రయించి, 2016లో వారికి పట్టా చేశాడు.

17 మంది రైతులు తమ భూమిపై వెళ్లడానికి సిద్ధపడగా ఇతరుల పేరుపై పట్టా ఉంది. దీంతో వివాదం చెలరేగింది. సీలింగ్ భూమిలో ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ప్రహరీ నిర్మిస్తోంది. విషయం తెలుసుకున్న రైతులు తమ భూమిలో ప్రహరీ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ భూమిని తాము కొనుగోలు చేశామని.. మజీద్‌పూర్‌కు చెందిన ఒక వ్యక్తి విక్రయించాడని పాఠశాల యాజమాన్యం తెలిపింది. రైతులు అప్పటి ఎమ్మార్వోని కలవగా, తనకేమీ తెలియదని, గతంలో పనిచేసిన వారికే తెలుసని బదులిచ్చారు. అనంతరం ఇప్పటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, ప్రస్తుత ఎమ్మార్వో రవీందర్ దత్తు, ఆర్డీవో అనంత రెడ్డిని కలిసి, తమ వద్ద ఉన్న ఆధారాలు అందజేసి న్యాయం చేయాలని కోరారు.

బాధితులకు న్యాయం చేస్త్తాం..

మజీద్‌పూర్ గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేశారు. సీలింగ్ భూములకు సంబంధించిన ఆక్రమణలపై విచారణ చేసి న్యాయం చేస్తాం. ఎక్కడైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.

 రవీందర్ దత్తు, ఎమ్మార్వో, అబ్దుల్లాపూర్‌మెట్

18 ఎకరాలు పరులపాలు

మజీద్‌పూర్‌లోని వివిధ సర్వే నంబర్లలో ఉన్న 18 ఎకరాల సీలింగ్ భూములు ఇప్పుడు అన్యాక్రాంతం అయ్యాయి. సీలింగ్ భూములను ఇతరులకు విక్రయించడం లేదా పట్టా చేయడం నిషేధం. కానీ భూ పోరాటం చేసిన ఒక నాయకుడు, మాజీ ప్రజాప్రతినిధి 18 ఎకరాలను తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకొని అనంతరం ఇతరులకు విక్రయించాడు. అప్పటి నుంచి 18 ఎకరాల భూమి పలువురి చేతులు మారింది. కాగా, ఆలస్యంగా విషయం తెలుసుకున్న 17 మంది లబ్ధిదారులు నివ్వెరపోయారు. తమ భూమి తమకే దక్కాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు తెలియకుండా తమ భూమిని కాజేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.