19-04-2025 11:45:27 PM
బెల్లంపల్లి ఎసిపి రవికుమార్...
మందమర్రి (విజయక్రాంతి): నేర నిర్ధారణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని కాలనీల ప్రజలు నేరాలు అరికట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ కోరారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పట్టణంలోని ప్రాణహిత కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని, సిసి కెమెరాలు ఉన్న ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని, ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని , సీసీ కెమెరాలు ప్రజలకు మరింత భద్రత కల్పిస్తాయని, సీసీ కెమెరాల ద్వారా చాలా కేసులు చేదించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
కేసుల ట్రయల్ సమయంలో సీసీ కెమెరాలు సాక్ష్యంగా ఉపయోగపడతాయని తెలిపారు. సీసీ కెమెరాలు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని సీసీ కెమెరాలు లేని కాలనీల ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటుకు ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించా లని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారా నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని ఆయన చెప్పారు.సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన ప్రాణహిత కాలనీ ప్రజలను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.