calender_icon.png 9 October, 2024 | 5:58 PM

రిలయన్స్, డిస్నీ డీల్‌కు సీసీఐ ఓకే

29-08-2024 12:00:00 AM

  1. తొలి ఒప్పందంలో మార్పులు 
  2. విలీన కంపెనీలో ఆర్‌ఐఎల్‌కు మెజారిటీ వాటా

న్యూఢిల్లీ, ఆగస్టు 28: రిలయన్స్, వాల్ట్ డిస్నీల 8.5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 70,000 కోట్లు) విలీన ఒప్పందానికి ఎట్టకేలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలి ఒప్పందానికి ఇరు కంపెనీలు కొన్ని మార్పులు చేసిన మీదట రెగ్యులేటర్ అనుమతి లభించింది. ‘స్వచ్ఛంద మార్పులకు లోబడి రిలయన్స్ ఇండస్ట్రీస్, వయోకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్‌ల ప్రతిపాదిత విలీన ఒప్పందాన్ని ఆమోదం తెలుపుతున్నాం’ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్‌లో పోస్టు చేసింది. వయోకామ్‌మ 18 రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగంకాగా, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన సబ్సిడరీ. అయితే ఇరు పార్టీలు కుదుర్చుకున్న తొలి ఒప్పందంలో చేపట్టిన మార్పులేమిటో సీసీఐ వెల్లడించలేదు. డీల్‌ను ఇంకా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆమోదం లభించాల్సి ఉంది. 

సీసీఐ లేవనెత్తిన అంశాలు

 కికెట్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులపై ఈ రెండు పూర్తి ఆధిపత్యం వహిస్తున్నదున పోటీ మార్కెట్‌కు అవరోధం కలుగుతుందనిఆందోళన వ్యక్తంచేస్తూ, ప్రతిపాదిత విలీనానికి బ్రేకు లు వేస్తూ ఇటీవల ఇరు కంపెనీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది. క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యం కారణంగా రిలయన్స్, వాల్డ్ డిస్నీ విలీన కంపెనీకి ధరల్ని నిర్ణయించే శక్తి, అడ్వర్‌టైజింగ్‌ను శాసించే శక్తి ఉంటాయని సీసీఐ భావించింది.  ఈ అంశ మై డిస్నీ, రిలయన్స్‌లతో సీసీఐ ప్రైవేటుగా చర్చలు కూడా  జరిపింది. రిలయన్స్, డిస్నీ విలీన సంస్థ టీవీ చానళ్లు, స్ట్రీమింగ్ కంపెనీలైన సోనీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లతో పోటీ పడుతుంది.  త్వరితంగా సీసీఐ ఆమోదం పొందేందుకు తాము 10 టెలివిజన్ చానళ్లను విక్రయించడానికి సిద్ధమంటూ ఇరు కంపెనీలు సీసీఐకి తెలిపాయి. 

నీతా అంబానీ నేతృత్వం

డీల్ ప్రకారం ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్, సంబంధిత సంస్థలకు విలీన కంపెనీలో 63.16 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 36.84 శాతం వాటా వాల్ట్ డిస్నీ వద్ద ఉంటుంది. దేశంలో అతిపెద్ద మీడి యా హౌస్‌గా ఆవిర్భవించనున్న కొత్త కంపెనీ రెండు స్ట్రీమింగ్ సర్వీసుల్ని, 120 టెలివిజన్ చానళ్లను నిర్వహిస్తుం ది. జాయింట్ వెంచర్‌లో రిలయన్స్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి చేస్తుం ది. విలీన కంపెనీకి ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ నేతృత్వం వహిస్తారు. డిస్నీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ చైర్‌పర్చన్‌గా ఉంటారు.