కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు
అమలుపై పరిశీలిస్తున్న కేంద్ర విద్యా శాఖ
సీఎండీ బలరామ్ వెల్లడి
హైదరాబాద్, జూలై 29 (విజయ క్రాంతి): సింగరేణి ఉద్యోగుల పిల్లలు, పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో సింగరేణి పాఠశాలలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విద్యా బోధనను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సీఎండీ ఎన్.బలరామ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదట రామగుండం ఏరియాలోని యైటింక్లున్ కాలనీలో ఉన్న సెక్టార్ సింగరేణి పాఠశాలలో ఈ విధానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.
ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఆధీనంలోని సీబీఎస్‌ఈకి దరఖాస్తు పంపామని పేర్కొన్నారు. సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి పొందామని స్పష్టంచేశారు. వచ్చే వారం నుంచి బోధనకు అనుమతివ్వాలని కేంద్ర విద్యాశాఖను కోరామని, సీబీఎస్‌ఈ నుంచి త్వరలోనే ఉన్నతస్థాయి బృందం పాఠశాలను సందర్శించి తరగది గదులను, పాఠశాల క్రీడా మైదానం, ప్రయోగశాలలు, ఇతల మౌలిక వసతులన్నీ పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తారని తెలిపారు. వసతులపై కేంద్ర విద్యాశాఖ సంతృప్తి చెందితే ప్రాథమికంగా రామగుండం ఏరియాలోని సెక్టార్ సింగరేణి పాఠశాలలో సీబీఎస్‌ఈ బోధనను ప్రారంభించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియాలోనూ ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించామని.. ఈ మేరకు ఇప్పటికే సింగరేణిలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలల ఆధునీకరణ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు.
వనమహోత్సవంలో పాల్గొనండి..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ ఉత్సాహంగా పాలు పంచుకోవాలని సీఎండీ బలరామ్ పిలుపునిచ్చారు. సోమవారం తన పుట్టిన రోజు సందర్భంగా సింగరేణి భవన్‌లో ఆయన మొక్కను నాటారు.