12వ తరగతిలో 87.98 శాతం మంది ఉత్తీర్ణత
10వ తరగతిలో 93.6 శాతం మంది పాస్
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి)/న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతుల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఉదయం 12వ తరగతి రిజల్ట్స్ రాగా, సాయంత్రం పదో తరగతి ఫలితాలను బోర్డు విడుదల చేసింది. ఈ ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సెట్‌తో పాటు ఉమాంగ్, డిజీలాకర్ యాప్‌ల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. పది తరగతిలో విద్యార్థులు 93.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. 2.12 లక్షల మందికి 90 శాతంపైగా మార్కులు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
12లో అమ్మాయిలదే హవా..
12వ తరగతి ఫలితాల్లో మొత్తం 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 91.52 శాతం మంది అమ్మాయిలు ఈసారి ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతం 6.40 శాతం అధికంగా నమోదైంది. దాదాపు 24 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో 95 శాతం కన్నా ఎక్కువ మార్కులను సాధించారు. 1.16 లక్షల మంది 90 శాతం మార్కులను తెచ్చుకున్నారు. దక్షిణాది చెందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలకు ఈసారి 16.21 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది ఫలితాల్లో 87.33 శాతం మంది పాసవ్వగా ఈసారి ఆ సంఖ్య స్వల్పంగా పెరిగింది.
ఫలితాలను చూసుకోండి ఇలా...
సీబీఎస్‌ఈ వెబ్‌సైట్ ద్వారా..
సీబీఎస్‌ఈ అధికార వెబ్‌సైట్ http:// www.cbse.gov.in సందర్శించాలి. అందులో రిజల్ట్స్ విభాగంపై క్లిక్ చేయాలి.12వ తరగతి ఫలితాలు 2024పై క్లిక్ చేయాలి. పదో తరగతి వాళ్లు అయితే 10వ తరగతి ఫలితాలు 2024ను ఎంచుకోవాలి. విద్యార్థి రోల్ నంబర్, స్కూల్ కోడ్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు
ఉమాంగ్ యాప్‌లో..
తొలుత మొబైల్ ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. సీబీఎస్‌ఈ రిజల్ట్స్ అని సెర్చ్ చేయాలి. రోల్ నంబర్‌తో పాటు ఇతర వివరాలు నమోదు చేయాలి. సబ్మిట్‌పై క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు
ఎస్‌ఎంఎస్ ద్వారా..
సబ్జెక్ట్‌ల వారీగా వివరాలు తెలుసుకోవడానికి కింది విధంగా 77382 99899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాల్సి ఉంటుంది. CBSE 12<Roll Number> <Date of Birth (DDMMYY)> <School Code> <Centre Code>