calender_icon.png 4 October, 2024 | 12:55 AM

సీఎంఆర్ కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ జరిపించాలి

03-10-2024 10:12:44 PM

ఖమ్మం,(విజయక్రాంతి):  సీఎంఆర్ రైస్ కుంభకోణంపై సీబీసీఐడీ విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఖమ్మం జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ గురువారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో సీఎంఆర్ రైస్ విషయంలో అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మకై రూ. 400 కోట్ల ప్రజా ధనాన్ని మింగేశారని ఆయన ఆరోపించారు. లేవి విషయంలో ప్రతి ఏడాది వందల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుని -ఎగవేతకు పాల్పడుతున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కవుతున్న ప్రభుత్వం ఉదాసీన వైఖరిని అవలంభిస్తుందని ప్రసాద్ తెలిపారు.

సామాన్యుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే -అధికార యంత్రాంగం మిల్లర్ల విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తుందని ప్రశ్నించారు. కొందరు మిల్లర్లు సంపన్నుల -విషయంలో ప్రభుత్వం సాగిల పడుతుందని వారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిన పట్టించుకునే స్థితిలో లేదని ఆయన ఆరోపించారు. లేవి బియ్యం విషయంలో మిల్లర్లకు సానుకూలంగా పెద్ద మొత్తం ప్రజల సొమ్మును చెల్లిస్తున్నారని దీని వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని దశాబ్ద కాలంగా సాగుతున్న ఈ కుంభ కోణానికి సంబంధించి సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు తగు రీతిలో స్పందించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. అవినీతికి పాల్పడిన రైసు మిల్లుల ఎదుట కూడా ఆందోళన చేపడతామని ఆయన తెలిపారు.