calender_icon.png 18 October, 2024 | 7:52 AM

పశు బీమా.. దక్కని ధీమా

18-10-2024 12:42:05 AM

  1. 2018 తర్వాత పథకాన్ని అమలు చేయని పాలకులు 
  2. భరోసా కోల్పోతున్న పాడి రైతులు 
  3. పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి

వికారాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామానికి చెంది భక్కి రాములు అనే రైతు ఈ ఏడాది జూన్ 2న తనకున్న రెండు ఎడ్లతో వ్యవసాయ పొలంలో పనులు చేస్తుండగా వర్షం పడింది. ఎడ్లను పొలంలోనే ఉంచి తాను గుడిసెలోకి వెళ్లాడు. ఈ క్రమంలోనే పిడుగు పడటంతో రెండు ఎడ్లు మృత్యువాత పడ్డాయి.

ఎడ్ల విలువ సుమారు రూ.1.60 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. అయితే, పశువులకు బీమా లేకపోవడంతో బాధిత రైతుకు ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. రెండు ఎడ్లు పిడుగుపాటుకు మృతిచెందడంతో తిరిగి ఇప్పటి వరకు ఎడ్లు కొనుగోలు చేయకపోవడమే కాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. 

ఆరేళ్లుగా నిలిపివేత 

రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిం చే వ్యవసాయ అనుబంధ రంగాలపై పాలకులు చిన్నచూపు చూస్తున్నారు. రైతులు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్ర మలను కొనసాగిస్తే ఆర్థికంగా ఆసరాగా ఉంటుంది. అయితే, ప్రభుత్వాలు పాడి పరిశ్రమలకు చేయూత అందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు.

గత ఆరేళ్లుగా పశు బీమా పథకాన్ని నిలిపివేయడంతో రైతులు ఇబ్బందు లు ఎదుర్కొం టున్నారు. గతంలో పాడి పశువులకు రైతు వాటా ప్రీమియం చెల్లిస్తే ప్రభుత్వం కొంత నగదును కలిపి బీమా సౌకర్యం కల్పించేది. దీంతో పశువులు మృ త్యువాత పడినా వచ్చిన బీమా డబ్బులతో రైతులు మళ్లీ పశువులను కొనుగోలు చేసేవారు. కానీ, ప్రస్తుతం పథకం నిలిచి పోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. 

పట్టించుకోని పాలకులు  

పాడి పశువుల బీమా పథకం 2017-18 వరకు ప్రభుత్వం అమలు చేసింది. అనంతరం ఆరేళ్లుగా ఈ పథకం గురించి పట్టించుకోవడం లేదు. అనివార్య కారణాలతో పశువులు మృత్యువాత పడితే రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. పశువులు రోడ్డు, విద్యుత్ ప్రమాదాలు, అనారోగ్యం, పిడుగుపాటు కారణంగా మృత్యువాత పడుతున్నాయి.

జిల్లాలో ఈ ఏడాది కురిసిన వర్షాల కారణంగా మూడుచోట్ల పశువులు వాగుల్లో కొట్టుకుపోగా, పిడుగుపాటుకు అనేక చోట్ల మృత్యువాత పడ్డాయి. రైలు, రోడ్డు ప్రమాదంలో 630 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం బీమా పథకాన్ని పునరుద్ధరించి ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.  

ప్రభుత్వం అందించిన పశువులకే బీమా  

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించిన పశువులకు మాత్రమే బీమా సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న యూనిట్ ధరలోనే పశువులకు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారు.

దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన పశువులకు బీమా సౌకర్యం ఉండి రైతులు కొనుగోలు చేసుకున్న పశువులకు మాత్రం బీమా సౌకర్యం కల్పించకపోవడం సరికాదని రైతులు వాపోతున్నారు. ప్రైవేట్ బీమా కంపెనీలను ఆశ్రయించి పశువులకు బీమా చేయించాలంటే సుమారు రూ.లక్ష ఉన్న పశువుకు రూ. 7 వేల నుంచి రూ.8 వేల ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు.

చాలా రోజులుగా అమలు చేయడం లేదు

పశు బీమా పథకాన్ని ప్రభుత్వం చాలా రోజులుగా అమలు చేయడం లేదు. 2012లో అప్పటి ప్రభుత్వం రెండు ఏళ్ల పాటు బీమా కల్పించింది. ఆ తర్వాత 2017-18లో కూడా ప్రభుత్వం పశు బీమా సౌకర్యం కల్పించింది. ఆ తర్వాత నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వం అందించిన పశువులకు మాత్రం యూనిట్ ఆధారంగా బీమా సౌకర్యం కల్పించారు. రైతులు సొంతంగా కొనుగోలు చేసిన పశువులకు ఎలాంటి బీమా సౌకర్యం లేదు. 

 వీ సదానందం, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి