రక్షించి ఒడ్డుకు చేర్చిన పోలీసులు
నల్లగొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామ శివారులో మూసీ ప్రవాహంలో చిక్కిన ఇద్దరు పశువుల కాపరులను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. భీమారం గ్రామానికి చెంది న సురుగు బాలస్వామి, బయ్యా గంగయ్య పశువులు మేపేందుకు, పలువురు కూలీలు ఇసుక తోడేందుకు ఆదివారం ఉదయం ఏరులోకి వెళ్లారు. ఎగువ కురిసిన వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో అధికారులు మధ్యాహ్నం మూడు క్రస్టుగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలారు.
ఒక్కసారిగా వరద చుట్టుముట్టడాన్ని గమనించి ఒడ్డుకు సమీపంలో ఇసుక తోడుతున్న కూలీలు బయటకు వెళ్లారు. పశువులను మేపుతున్న బాలస్వామి, గంగయ్య ఏరు మధ్యలోని పెద్ద బండరాయి పైకి ఎక్కారు. వరద ఉధృతి పెరగడంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. విషయం తెలిసి నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఎస్సై శివతేజ అక్కడికి చేరుకొని సూర్యాపేట అగ్నిమాపక సిబ్బంది సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తాళ్లసాయంతో ఇద్దరిని సాయంత్రం 6 గంటల తరువాత సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. పశువులు ఈదుతూ ఒడ్డుకు చేరాయి.