calender_icon.png 22 October, 2024 | 8:09 AM

కృష్ణానది తీరంలో క్యాట్ ఫిష్

29-07-2024 12:27:14 AM

నిషేధిత చేపలను పెంచుతున్న వ్యాపారులు

వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా దందా

వీటిని తింటే అనారోగ్యమే..

పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు 

వనపర్తి, జూలై 28 (విజయక్రాంతి): కృష్ణానది పరివాహాక ప్రాంతాలైన గద్వాల, ధరూర్ మండలం, వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రాంపురం గ్రామాల శివారుల్లో   నిషేధిత క్యాట్ ఫిష్ పెంపకం యథేచ్ఛగా జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది నిర్వాహకులు వ్యవసాయ పొలాలను లీజుకు తీసుకుని, క్యాట్‌ఫిష్‌లను పెంచుతున్నారు. చికెన్ వేస్టేజీ, వ్యర్థాలను ఆరగించే ఈ చేపలను తింటే అనా రోగ్యం బారిన పడుతారు. దీంతో ప్రభు త్వం వీటి పెంపకాన్ని నిషేధించింది. అయినా కూడా కొందరు అక్రమంగా పెంచి, అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 

కుళ్లిన వ్యర్థాలే వాటి ఆహారం

చేపలను తింటే మంచిదని వైద్యులు చెపుతుంటారు. చేపలు నీటిలో ఉండే నాచును, ఇతర జీవులను ఆహారంగా తీసుకుంటాయి. క్యాట్‌ఫిష్‌లు మాత్రం కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు, కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. క్యాట్‌ఫిష్‌లు పెంచే చెరువుల్లో ఏదైనా జంతువు పడి తే దాని కూడా ఆ చేపలు తినేస్తాయి. అయితే ఈ రకం చేప లు రుచిగా ఉంటాయనే కారణం తో చాలా ప్రాంతాల్లో వీటికి డిమాండ్ ఉంటుంది. దీని ఆస రా చేసుకునే కొంతమంది నిర్వాహకులు వీటిని పెంచుతూ సొమ్ము చేసుకుం టున్నా రు. పెద్ద ఎత్తున చికెన్ వ్యర్థాలను సేకరించి క్యాట్‌ఫిష్‌ల పెంపకానికి వినియోగిస్తున్నారు. అయినా కూడా వనపర్తి, గద్వాల జిల్లాల అధికారులు పట్టించుకోవడం లేదు. 

ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ

క్యాట్‌ఫిష్‌ల పెంపకానికి పెద్దగా ఖర్చు ఉండదు. పైగా వీటికి ఆహారంగా చనిపోయి న కోళ్లు, కుళ్లిపోయిన వ్యర్థాలు వేస్తారు. దీం తో ఖర్చు తక్కువగా ఉంటుంది. త్వరగా భారీ సైజులోకి మారే ఈ చేపల పెంపకానికి పెద్ద గా కష్టపడాల్సిన అవసరం సైతం లేదు. దీం తో నిర్వాహకులు నిషేధం ఉన్నప్పటికీ గుట్టు గా పెంపకాలు జరుపుతున్నారు. 

కొర్రమీను పేరుతో అమ్మకాలు 

కొర్రమీనులాగే క్యాట్‌ఫిష్‌లు ఉంటాయి. కొర్రమీనుకు మీసాలు ఉండవు. క్యాట్‌ఫిష్‌కు మీసాలు ఉంటాయి. క్యాట్‌ఫిష్‌లకు మీసాలు తీసేసి వ్యాపారులు తమ తెలివిని ప్రదర్శిస్తూ కొర్రమీను అని నమ్మించి, విక్రయిస్తూ ప్రజ ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.  

వనపర్తి మున్సిపాలిటిలో పోటాపోటీ

చికెన్ వ్యర్థాలను అమ్ముకుంటే లక్షల్లో సంపాదించవచ్చని టెండర్‌ను దక్కించుకునేందుకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో పోటీ పెరిగింది. చికెన్ వ్యర్థాలను సేకరించి జంతువుల ఆహార తయారీ కంపెనీకి పంపుతున్నట్లు బహిరంగగా చెబుతూ.. క్యాట్‌ఫిష్ పెంపకానికి పంపుతున్నారు. దీంతో భారీ మొత్తంలో నగదు రావడంతో కాంట్రాక్టర్లు టెండర్‌ల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా టెండర్ తమకే దక్కేలా చూసుకుంటున్నారు.

టన్నుల కొద్దీ చికెన్ వేస్టేజీ

క్యాట్‌ఫిష్ తినే చికెన్ వ్యర్థాలకు డిమాండ్ ఉండటంతో ఈ బిజినెస్‌పై చాలా మంది ఫోకస్ పెడుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో దాదాపుగా 100కు మించి, గద్వాల జిల్లా కేంద్రంలో 90 వరకు చికెన్ సెంటర్లు ఉంటాయి. ప్రతి చికెన్ సెంటర్‌కు క్యాట్‌ఫిష్ పెంపకం నిర్వాహకులు వెళ్లి చికెన్ వ్యర్థాల కోసం అడ్వాన్సులు ఇచ్చి తెస్తుంటారు. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయం త్రం వేళ్లలో ముందుగానే మాట్లాడుకుని ఒప్పందం చేసుకున్న ప్రకారంగా చికెన్ సెంటర్ల నిర్వాహకులు చికెన్ వేస్టేజి (కాళ్లు, మెడకాయ, తలకాయ, పేగులు) ఇస్తారు. ప్రతిరోజు రెండు జిల్లాల్లో 6 నుంచి 8 టన్నుల వరకు రాగా, ఆదివారం 10 నుంచి 12 టన్నుల వరకు వ్యర్థాలను క్యాట్‌ఫిష్‌లకు ఆహారంగా తీసుకెళ్లారు.