calender_icon.png 19 November, 2024 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో కుల రాజకీయం!

01-09-2024 01:13:23 AM

  1. ఎస్సీల చుట్టూ తిరుగుతున్న పార్టీలు
  2. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 23 శాతానికి పైనే
  3. సగం చోట్ల గెలుపోటములను నిర్ణయించే స్థాయి
  4. ఈసారి రంగంలోకి బీఎస్పీ, ఎఎస్పీ పార్టీలు
  5. కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో గుబులు

చండీగఢ్, ఆగస్టు 31: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఊపందుకొన్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకుండా పోరుకు దిగాయి. ఇప్పుడు ప్రధాన పార్టీలకు ప్రతి ఓటూ కీలకమే కావటంతో ఈ పార్టీలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తోపాటు ఆజాద్ సమాజ్ పార్టీ కూడా చెమటలు పట్టిస్తున్నాయి.  ముఖ్యంగా రాష్ట్రం లో ఇప్పుడు దళితుల ఓట్లు కీలకంగా మారా యి. దీంతో వారిని ప్రసన్నం చేసుకొనేందుకు పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి.

ఎస్సీల ఆధిపత్యం

హర్యానా అసెంబ్లీలో 90 సీట్లు ఉన్నాయి. అక్టోబర్ 5న ఒకే విడుతలో ఇక్కడ పోలింగ్ జరుగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. అయితే దానికి పూర్తి మెజారిటీ లేకపోవటంతో జేజేపీ మద్దతు తీసుకొన్నది. ఇటీవల ఆ పార్టీ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. దీంతో ఆగ్రహించిన బీజేపీ.. జేజేపీని చీల్చి కొంతమంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొన్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయం రంజుగా మారింది. హర్యానాలో ఎస్సీల జనాభా 2011 లెక్కల ప్రకారమే 22.2 శాతం.

ఈ 13 ఏండ్లలో కనీసం రెండుమూడు శాతమైనా పెరిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో 22.5 శాతం, పట్టణ ప్రాంతాల్లో 15.8 శాతం ఎస్సీ జనాభా ఉన్నది. ఎస్సీ జనాభాలో సగం వరకు జాతవ్ కులమే ఉంటుంది. కనీసం 45 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలు పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో 17 ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. ఫతేహాబాద్ జిల్లాలో అత్యధికంగా ఎస్సీ జనాభా 30.2 శాతం ఎస్సీలు ఉన్నారు. సిర్సాలో 29.9 శాతం, అంబాలాలో 26.3 శాతం, ఫరీదాబాద్‌లో 12.4 శాతం, గురుగ్రామ్‌లో 13.1 శాతం ఉన్నారు. అతి తక్కువగా మేవాత్‌లో 6.9 శాతం ఉన్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతృత్వంలోని ఇండియా కూటమికి గంపగుత్తగా 68 శాతం ఎస్సీలు ఓటు వేశారు. 2019తో పోల్చితే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ. అదే సమయంలో బీజేపీ 34 శాతం మంది ఎస్సీల మద్దతు కోల్పోయింది. ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో 24 శాతం మంది ఎస్సీలు మాత్రమే మద్దతు పలికారు. దీంతో 2019లో రాష్ట్రంలోని 10 లోక్‌సభ స్థానాలు గెలిచిన ఎన్డీయే కూటమి.. గత ఎన్నికల్లో 5 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని 5 లోక్‌సభ స్థానాలు గెలిచింది. 

ఇండియా కూటమివైపు ఎస్సీలు!

లోక్‌సభ ఎన్నికల్లో ఎస్సీ ఓటర్లు స్పష్టంగా ఇండియా కూటమివైపు నిలిచారు. రాష్ట్రంలోని 17 ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ స్థానాల్లో గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు గెలుస్తూ వస్తున్నాయి. ఈ 17 సీట్లలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్డీ 9, కాంగ్రెస్ 7 గెలిచి సంపూర్ణ ఆధిపత్యం చూపాయి. 2014లో బీజేపీ పుంజుకొని 9 సీట్లు గెలిచింది. ఐఎన్‌ఎల్డీ మూడు సీట్లకు, కాంగ్రెస్ 4 సీట్లకు పరిమితమయ్యాయి. 2019లో ఎస్సీ ఓటర్లు మళ్లీ బీజేపీ షాకిచ్చారు. ఆ పార్టీ 5 చోట్ల మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ 7, జేజేపీ 4 సీట్లు గెలిచాయి. ఓట్ల శాతం పరంగా చూస్తే బీజేపీకే అత్యధికంగా 33 శాతం ఓట్లు పడ్డాయి. 

జాతవ్‌లదే ఆధిపత్యం

హర్యానా ఎస్సీల్లో జాతవ్ కులానిదే మొదటినుంచీ ఆధిపత్యం. మొత్తం ఎస్సీ జనాభాలో వీరే సగం వరకు ఉంటారు. అంతేకా దు.. ఏకంగా 49 స్థానాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరు. ఈ అన్ని చోట్ల మొత్తం జనాభాలో 10 శాతానికి పైగానే ఉంటారు. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ వీరికి వంగివంగి దండాలు పెడు తున్నాయి. వీరిప్రభావం హిస్సార్, అంబాలా, రోహ్‌తక్, గురుగ్రామ్, ఫరీదాబాద్ కర్నాల్‌లో అధికంగా ఉంటుంది. ఇక్కడ 2009లో కాంగ్రెస్ సగం సీట్లు గెలిచింది. 2014లో బీజేపీ పుంజుకొని 27 చోట్ల గెలుపొందింది. 2019లో 21 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ 5 సీట్ల నుంచి 15కు పెరిగింది. ఐఎన్‌ఎల్డీ నుంచి వచ్చిన జేజేపీ 8 సీట్లు గెలిచింది. 

పొత్తులు ఖరారు

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో ఐఎన్‌ఎల్‌డీ, ఏఎస్‌పీతో జేజేపీ పొత్తు పెట్టుకొ న్నాయి. అభయ్ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ 53 చోట్ల, బీఎస్పీ 37 చోట్ల పోటీ చేస్తున్నాయి. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ 70 చోట్ల, ఏఎస్‌పీ 20 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. గత మూడు ఎన్నికల్లో బీఎస్పీకి ఎస్సీల్లో 3 శాతానికి మించి ఓట్లు రాలేదు. అయినా ఆ పార్టీకి ఐఎన్‌ఎల్‌డీ 37 సీట్లు ఇచ్చింది. ఇక చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఏఎస్పీ రాష్ట్రంలో కొత్తగా పోటీ చేస్తున్నది. అది ఎంతవరకు ప్రభావం చూపుతుందన్నది అనుమానమే. అయినా ఒక్క ఎస్సీ ఓటు కూడా బీజేపీ, కాంగ్రెస్ వైపు వెళ్లరాదన్న లక్ష్యంతో వీరు కూటములు కట్టారు. 

కాంగ్రెస్ వ్యూహానికి గండి?

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అనూహ్యంగా పుంజుకొన్న కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నది. కాస్త కష్టపడితే అధికారం మనదే అన్న ఆలోచనలో ఉన్న ఆ పార్టీ పెద్దలు.. జాట్‌లు, దళితులు, ముస్లింలను కలిపి బలమైన ఓటుబ్యాంకుగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ మూడు వర్గాలు కలిస్తే రాష్ట్ర జనాభాలో సగానికిపైగా ఉంటారు. ఈ వ్యూహంతోనే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయవంతమైంది.

68 శాతం ఎస్సీలు, 64 శాతం జాట్‌లు ఇండియా కూటమివైపు నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫార్ములాను కొనసాగించేందుకు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. అందుకు ఐఎన్‌ఎల్‌డీ జేజేపీ కూటములు గండికొడుతాయేమోన్న భయం ఇప్పుడు కాంగ్రెస్‌ను వెంటాడుతున్నది. నిజానికి జాట్‌లకు, ఎస్సీలకు, ముస్లింలకు చారిత్రకంగా పెద్దగా సఖ్యత ఏమీ లేదు. ఈ అంశం కూడా కాంగ్రెస్‌ను భయపెడుతున్నది. మరి రాష్ట్రంలో ఎవరి భవిత్యం ఏమిటో అక్టోబర్ 8న తేలుతుంది.