రాహుల్ గాంధీపై ఎంపీ ఠాకూర్ ‘కులం’ వ్యాఖ్యలు
రికార్డుల నుంచి తొలగించిన వీడియో పోస్ట్ చేసిన ప్రధాని కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ, జూలై 31: పార్లమెంటులో కుల పంచాయితీ ముదురుతున్నది. ఓబీసీ జనగణన చేపట్టాలన్న ప్రతిపక్ష డిమాండ్‌పై అధికార పక్ష నేతలు అవమానకరంగా మాట్లాడటంతో వివాదం మొదలైంది. ‘కొంతమందిని కులమనే దెయ్యం వెంటాడుతోంది. కులం తెలియని వారు కూడా కుల గణన గురించి మాట్లాడుతున్నారు’ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మంగళవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు బుధవారం కూడా సభను కుదిపేశాయి.
రికార్డుల నుంచి తొలగించిన ఠాకూర్ వీడియోను ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో పోస్ట్‌చేసి, అందరూ చూడాలని కోరటంపై కాంగ్రెస్ భగ్గుమన్నది. బుధవారం కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ ప్రధాని మోదీపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టారు. ఎంపీ ఠాకూర్ అభ్యంతకర వ్యాఖ్యలను సభాపతి తొలగించగా, ప్రధాని మోదీ తిరిగి ఆ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై బుధవారం ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. రాహుల్ కులం గురించి అడిగితే తప్పేమిటని బీజేపీ ఎంపీలు ప్రశ్నించటంతో కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు.
పెద్దల సభలో ఖర్గే భావోద్వేగం
తన కుటుంబమంతా రాజకీయాల్లోనే ఉన్నదని పార్లమెంట్ సాక్షిగా మంగళవారం బీజేపీ ఎంపీ ఘన్‌శ్యామ్ తివారీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, వాటిని రికార్డులను తొలగించాలని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌ను ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తన బాల్యాన్ని తలుచుకుంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. తన కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తి తానేనని స్పష్టం చేశారు. యువకుడిగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగానని చెప్పుకొచ్చారు. ఎంపీ తివారీ వ్యాఖ్యలు దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై చైర్మన్ స్పందిస్తూ.. ఎంపీ తివారీ వ్యాఖ్యలు తనకు అభ్యంతరకరంగా అనిపించలేదని, అయినప్పటికీ రికార్డులను పరిశీలించి, తివారీ చేసిన వ్యాఖ్యల్లో ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే తొలగిస్తామని హామీ ఇచ్చారు.