calender_icon.png 3 October, 2024 | 2:37 PM

మునిపంపులలో కుల బహిష్కరణ

02-10-2024 02:15:34 AM

అన్నదమ్ముల మధ్య భూతగాదా

దంపతులను కులబహిష్కరణ చేస్తూ సంఘం పెద్దల తీర్పు

అవమానభారంతో ఆత్మహత్యాయత్నం

ఎల్బీనగర్, అక్టోబర్ 1: అన్నదమ్ముళ్ల మధ్యన భూతగాదాతోపాటు తాటిచెట్ల పంపకంలో తమ మాట వినడం లేదని కుల సంఘం పెద్దలు.. కుల బహిష్కరణ చేయడంతో అవమానభారం తట్టుకోలేక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు చావుబతుకుల మధ్యన వనస్థలిపురంలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన కల్లూరి నర్సింహ, కల్లూరి రమేశ్ ఇద్దరు అన్నదమ్ముళ్లు. వారసత్వంగా వచ్చిన భూమిపై ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి ఇద్దరి మధ్యన తగాదా నడుస్తోంది. కుల పెద్దలు జోక్యం చేసుకుని ఇరువురి నుంచి  రూ.20వేల డిపాజిట్ చేయించుకుని.. భూతగాదాపై తీర్పు ఇచ్చారు.

అయితే కులపెద్దలు ఇచ్చిన తీర్పును రమేశ్ అంగీకరించలేదు. తమ తీర్పునే కాదంటారా? అని రమేశ్, అతని భార్యపై కుల బహిష్కరణ తీర్పు జారీచేశారు. ఈ క్రమంలోనే బోనాల ఉత్సవాల సందర్భంగా రమేశ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన బోనాన్ని అమ్మవారి వద్ద పెట్టనీయలేదు. కులంలో లేనివాడికి బోనం పెట్టడానికి వీలులేదని, ఇతర కారణాలతో రమేశ్‌ను వేధించారు.

దీనిపై పంచాయితీలు జరిగినా తెగలేదు. ఈ విషయమై రమేశ్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 30న (సోమవారం) తాటిచెట్ల పంపకం జరిగింది. వాటాల విషయంలో కులపెద్దలతో రమేశ్‌కు మరోసారి పంచాయితీ జరిగింది. ఈ క్రమంలో రమేశ్‌కు ఇవ్వాల్సిన తాటిచెట్లు ఇవ్వడం లేదని... అసలు కులంలోనే లేవని వేధింపులకు గురిచేశారు.

కుల బహిష్కరణ, తాటిచెట్ల పంపకాల్లో అన్యాయాన్ని భరించలేకపోయిన రమేశ్, అతడి భార్య వసంత సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డారు. స్థానికులు వారిని వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.