యాదాద్రి భువనగిరి, (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు ధమాషా మేరకు రిజర్వేషన్లు అమలు కావాలని, కుల గణనకు ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చామని , స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లకు నిర్దిష్ట ప్రణాళికలు అందజేశామని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. పదవులు నిర్వహించడం తన జీవితంలో కొత్తవి కాదని ఏ జాతుల హక్కుల కోసం కృషి చేశానో ఆ వర్గాలకు చెందిన బీసీ కమిషన్ చైర్మన్ గా పనిచేయడం తన జీవితంలో మధుర ఘట్టం అని ఆయన తెలిపారు. శనివారం యాదాదీశ్వరుని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకున్నారు. ఈరోజు స్వామివారి సన్నిధిలో గడపడం ఆనందంగా ఉంది అన్నారు.
ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కరరావు స్థానిక ఆర్డిఓ జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆయన దర్శన ఏర్పాట్లలో పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు అర్చక స్వాములు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అనంతరం ఆలయం వెలపల వకుళభరణం విలేకరులతో కాసేపు మాట్లాడారు. బలహీనవర్గాలు కుల గణన నిర్వహించాలని చిరకాలంగా కోరుతున్నారని, అది ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి శక్తిని ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి మహత్తర ఘట్టంలో కులగరణ చేపట్టాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించే అవకాశం రావడం, ఇంటింటి సర్వే నిమిత్తం ప్రశ్నావళి రూపొందించి ప్రభుత్వానికి అందజేసే కార్యాచరణలో భాగం అవడం జీవితంలో గొప్ప సంఘటనగా గుర్తుండి పోతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
తన పదవి కాలం ఈరోజుతో ముగుస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించిన అంకితభావంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీసీలలోని సంచార విముక్తి జాతులు కులాలు ఇప్పటికీ ఆధునిక అభివృద్ధిని అందుకోలేకపోతున్నారని కుల సర్వే పూర్తి అయ్యాక వచ్చిన సమగ్ర సమాచారంతో వారి జీవన ప్రమాణాలలో మెరుగుదల తీసుకురావాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలలో డెడికేటెడ్ కమిషన్ గా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించడానికి విశేషంగా కృషి చేశానని అయితే గడువు ముగియడం కారణంగా తుది నివేదిక ఇవ్వకుండానే నిష్క్రమించడం. కొంత ఇబ్బంది కలిగిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియాలని స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు కోరుతున్న విధంగా ప్రజా ప్రాతినిధ్యం పెరగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా తన పదవి బాధ్యతలను కొనసాగించడానికి సహకరించిన రేవంత్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.