ప్రత్యేక కాలం పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశవ్యాప్తంగా కులగణన కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నా ఇప్పటివరకు అందుకు తిరస్కరిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం మనసు మార్చుకొన్నట్లు తెలుస్తున్నది. మూడేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జనగణనను త్వరలో చేపట్టనున్న నేపథ్యంలో అందులో కులానికి సంబంధించిన కాలం చేర్చనున్నట్టు తెలిసింది. 1881 నుంచి దేశంలో ప్రతి పదేండ్లకోసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతున్నది. కొవిడ్ కారణంగా 20 21లో నిర్వహించాల్సిన జనగణన వాయిదా పడింది. ఈ ఏడాది చివరలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో జనగణన ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
సవివరమైన డాటా
జనాభా లెక్కల సేకరణ అంటే ఒక కుటుంబంలోని సభ్యుల పేర్లు నమోదు చేయటం కాదు. ఆ కుటుంబానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరిస్తారు. ఒక్కో కుటుంబ వివరాలు ఒక్కో ఫాంలో నమోదుచేస్తారు. ఒక్కో వివరం కోసం ఒక్కో గడి కేటాయించబడి ఉంటుంది. త్వరలో నిర్వహించబోయే జనాభా గణన ఫాంలో కుల వివరాల నమోదుకు ప్రత్యేకంగా ఒక గడిని చేర్చనున్నట్లు సమాచారం.