calender_icon.png 13 February, 2025 | 7:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి కులగణన సర్వే

13-02-2025 12:42:39 AM

ఈనెల 16 నుంచి 28 వరకు

గతంలో పాల్గొనని వారికి మరోఛాన్స్

ఆ 3.1% మంది ఈసారి వివరాలివ్వాలి

  1. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం
  2. మార్చి మొదటివారంలో అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తాం
  3. తర్వాత పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా కృషి చేస్తాం
  4. కలసివచ్చే పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి 
  5. నాయకత్వంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం
  6. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
  7. మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు సమగ్ర ఇంటింటి సర్వేలో వివరాల నమోదుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ర్టంలో 3.1శాతం మంది సర్వేలో పాల్గొనలేదన్నారు.

కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి వాళ్లు ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదని, మరికొందరు అందుబాటు లో లేక వివరాలను నమోదు చేసుకోలేదని భట్టి వివరించారు. 3.1శాతం మంది వివరాలు నమో దు చేసుకునేందుకు రెండోసారి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మండల కార్యాలయాల్లోని ప్రజాపాలన సెంటర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని భట్టి చెప్పారు. సర్వేలో పాల్గొనాలనుకునేవారు అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అవసరమైతే ఆన్‌లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు చెప్పినా అధికారులు వివరాలను నమోదు చేస్తారని చెప్పారు. టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి అధికారులను ఇంటికి రమ్మన్నా వస్తారని వెల్లడించారు. రాష్ర్టంలో కులగణన విజయవంతం అయితే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునే కొందరు రీ సర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికిపైగా సిబ్బందితో పూర్తిగా శాస్త్రీయంగా సర్వేను నిర్వహించామన్నారు.

42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం..

రాష్ర్టంలో బీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని భట్టి పేర్కొన్నారు. దశాబ్దాల బీసీల కలను నిజం చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

శాసనసభలో ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్ట చేశారు.  పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.

పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలనేది అందరి కోరిక అని, సర్వేకు సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు ఆమోదం కోసం, రాజకీయాలను పక్కన పెట్టి.. పార్టీలు, సోషల్ యాక్టివిస్టులు, మేధావులు, ప్రజలు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ వచ్చింది. మార్చి మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దును ప్రవేశపెట్టనుంది. బుధవారం కమాండ్ కంట్రోల్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎన్నికల అంశంతో పాటు ఆర్థిక శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

వాస్తవానికి మొదట స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సర్కారు అనుకున్నది. అందుకోసం ఇప్పటివరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. అయితే తాజాగా రిజర్వేషషన్లు తేలిన తర్వాతే. స్థానిక ఎన్నికలకు పోవాలని సర్కారు భావించిన నేపథ్యంలో ఎలక్షన్లు దూరం జరిగాయి. ఈ క్రమంలో మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.

స్థానికం మరింత ఆలస్యం!
స్థానిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి చేసిన తాజా ప్రకటన దీనికి బలాన్ని చేకూరుస్తుంది. 42శాతం బీసీ రీజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నిక లకు పోతామన్న కోణంలో భట్టి మాట్లాడారు. మార్చిలో అసెంబ్లీలో బీసీ రీజర్వే షన్ల బిల్లుకు ఆమోదించిన తర్వాత.. పార్లమెంట్‌కు ప్రభుత్వం పంపనుంది. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించడం అంత          

సులువేమీ కాదు. అన్ని పార్టీలను ఒప్పించి ఉభయ సభల్లో దీన్ని ఆమోదింపజేయాలంటే చాలా సమయం పడుతుంది. అసలు ఉభయ సభల్లో ఆమోదం లభిస్తుందా? అన్నది కూడా ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలనుకుంటే.. ఈ ప్రక్రియ మరికొన్ని నెలలు ఆలస్యమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.