- 20వ తేదీన అఖిలపక్ష సమావేశం
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సమగ్ర కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా నిలవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.
శుక్రవారం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, టీజేఎస్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్‌ను కలిశారు. 20వ తేదీన హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన అభిపక్ష సమావేశానికి రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు.
రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీఓను జారీ చేసిందని, ఈ ప్రక్రియ వేగవంతం అయ్యేలా, విభేదాలు లేకుండా ముందుకు పోయేలా సహకరించాలని కోరారు. అఖిలపక్ష సమావేశానికి హాజరవుతామని కోదండరామ్, సాంబశివరావు తెలిపినట్లు ఆయన వెల్లడించారు.
బృందంలో బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, నాయకులు తాటికొండ విక్రమ్, సింగం నరేశ్ తదితరులు పాల్గొన్నారు.