calender_icon.png 8 April, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జనగణనలో కులగణన చేర్చాలి

08-04-2025 01:17:24 AM

నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జాతీయ జనగణనలో కులగణన చేర్చాలని, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించి, 9వ షెడ్యూల్‌లో చేర్చాలని నేషనల్ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ వ్యాప్తంగా జరిగే జాతీయ జన గణనలో కుల గణన చేర్చాలని, కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఒప్పించడానికి గాందేయ మార్గంలో గత వారం రోజుల నుండి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన బీసీ ఆజాది జేఏసీ చైర్మన్ బత్తుల సిద్దేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ లకు పలు బీసీ సంఘాలు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించాయి.

ఈ సందర్భంగా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన, విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో బీసీ జనాభా దామాషా వాటా కోసం హైదరాబాద్ లో 12 రోజుల ఆమరణ దీక్ష ఫలితంగా నేడు బీసీలు కులగణన సాధించామన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్ కేటాయించాలని, దీంతో అందరికీ సామాజిక న్యాయం అందుతుందన్నారు. ఢిల్లీలో చేపట్టిన బీసీల ఆమరణ నిరాహార దీక్షకు బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, బీజేపీ మంత్రులు ఢిల్లీకి వెళ్లి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో  రాష్ట్రంలోని ప్రతి గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లోని మంత్రుల కార్యాలయాలు, ఇండ్లను ముట్టడించి, బీసీ మంత్రు లను నిలదీస్తామని హెచ్చరించారు. అనంతరం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు బీసీలు చేపడుతున్న పోరాటాలు, ఆమరణ నిరాహార దీక్షలకు మద్దతు తెలుపడంలో ఎందుకు ఆలోచిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే  రఘునందన్ రావు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్ని సమస్యలపై స్పందిస్తున్నప్పుడు బీసీ సమస్యలు, డిమాండ్లపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.  అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతిస్తున్నాయని, కేవలం బీజేపీ మాత్రమే బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని విమర్శించారు. 12 రోజుల పాటు ఢిల్లీలో చేపట్టిన బీసీ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ, బీజేపీ మంత్రులు మద్దతు ప్రకటించాలని, లేకపోతే రాబోయే ఎన్నికల్లో భంగపాటు తప్పదని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్ గౌడ్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, పర్వత సతీష్ కుమార్ పటేల్, మధు, నాగేష్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.