calender_icon.png 25 October, 2024 | 3:53 AM

కులగణన ఓ యజ్ఞంలా సాగాలి

25-10-2024 01:39:40 AM

  1. బీసీ రిజర్వేషన్ల పెంపే లక్ష్యంగా నిర్వహించాలి
  2. సాంకేతికతతో బీసీ కులాలను సూక్ష్మంగా లెక్కించాలి
  3. బీసీ కమిషన్‌తో భేటీలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో సమగ్ర కులగణన సర్వేను ఓ యజ్ఞంలా నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీ య అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. గురువారం బీసీ సంఘా లు, కుల సంఘాలతో బీసీ కమిషన్ సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటిసారి చేపడుతున్న కులగణన సర్వేను బీసీ కమిషన్ హేతుబద్ధంగా నిర్వహించి, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కులగణనపై రాష్ట్రవ్యా ప్తంగా విస్తృత ప్రచారం కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని కోరారు. సమగ్ర కులగణనకు తక్షణమే ప్రశ్నావళిని రూపొందించి మార్గదర్శకాలు విడుదల చేయాలన్నారు.

కులగణన సర్వే ద్వారా చాలా సూక్ష్మంగా, నిశితంగా కులాల వారిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను లెక్కించాలని కోరారు. సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు కమిషన్‌కు బీసీ సమాజం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

బీసీ కులాల అధ్యయనం కోసం చేపట్టనున్న జిల్లాల పర్యటనకు మద్దతు తెలిపి బీసీ కమిషన్ పర్యటనను విజయవంతం చేయాలని బీసీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సామాజిక కులగణన సర్వేకు రాష్ట్రంలోని బీసీలంతా సహకరించాలని, బీసీల ఆకాంక్షలకు అనుగుణంగానే కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మీ స్పష్టం చేశారు.

కమిషన్‌ను కలిసిన వారిలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్‌చారి, బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు వెంకటేశ్, శేఖర్, విక్రమ్‌గౌడ్, మణిమంజరి, దుర్గయ్య, వెంకన్న, బాల కృష్ణ, శ్రీనివాస్, ఎం.భాగయ్య, నగేశ్, శ్యామల, చంద్రశేఖర్, సంధ్య ఉన్నారు.