calender_icon.png 7 February, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి

07-02-2025 12:54:51 AM

  1. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి
  2. చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి
  3. ఢిల్లీలో బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
  4. హాజరైన వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): కులగణన చేపట్టి.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, పార్లమెంట్‌లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, బీసీలకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

గురువారం ఢిల్లీ ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన నేషనల్ ఓబీసీ సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేసిందని, ఇటీవల బీసీలైన నలుగురిని గవర్నర్లుగా నియమించిందని, జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చిందన్నారు.

అయితే కేంద్రంలో బీసీ రిజర్వేషన్లను వర్గీకరించడానికి కమిషన్‌ను నియమించాలన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం చేయాలన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతీ కులానికి, సామాజికవర్గానికి వారి వారి జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణమని కృష్ణయ్య స్పష్టం చేశారు.

రాజ్యాంగ రచన సమయంలోనే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని.. కానీ కల్పించకుండా అన్యాయం చేశారని అన్నారు. ఇప్పటి వరకు 121 సార్లు రాజ్యాంగ సవరణలు చేసినా.. రాజ్యాధికారంలో బీసీలకు వాటా కల్పించడానికి పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టలేదన్నారు. 

ఇవీ బీసీల డిమాండ్లు..

పార్లమెంట్‌లో బీసీ బిల్లు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంపు, జనగణనలో కులాల వారీగా గణన, బీసీ ఉద్యోగులకు పదోన్నతులు, బీసీల క్రిమీలేయర్ తొలగింపు, బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా, బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటన, హైకోర్టు, -సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు, రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు తదితర డిమాండ్లను అమలు చేయాలని ఈ సెమినార్‌లో తీర్మానించారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి ఈ సమావేశానికి హాజరవ్వడం విశేషం. బీజేపీ, టీడీపీ ఎంపీలు ఈటల రాజేందర్, బీద మస్తాన్ రావు, పార్థసారథి, నాగరాజు, అంబిక లక్ష్మీనారాయణ, పుట్ట మహేశ్ యాదవ్, ప్రసాద్‌రావు, బీసీ సంక్షేమ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, బోను దుర్గా నరేశన్ సహా 36 కుల సంఘాలు, 28 బీసీ సంఘాలు, 18 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.