calender_icon.png 24 December, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన దేశానికే ఆదర్శం కావాలి

06-11-2024 12:17:48 AM

భారతీయ సమాజ సమగ్ర చిత్రాన్ని రూ పొందించాలన్నా, సమాజంలో గల సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్మూలించి అసమానతలు తగ్గించాలన్నా, దేశంలో కుల నిర్మూలన చేయాలన్నా వనరుల సమాన పంపిణీ కోసం, పథకాల రూపకల్పనకు కులాల సమగ్ర సమాచారం అవసరం. 

1949 నవంబర్ 25న నవ భారత నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన చివరి ఉపన్యాసంలో ‘ ప్రతి మనిషికి ఒక ఓటు, ప్రతి ఓటుకు సమాన విలువ ఇవ్వడం ద్వారా రాజకీయ రంగంలో సమానత్వాన్ని సాధించాం.సాంఘిక ఆర్థిక రంగాల్లో సమానత్వం సాధించాలి, భవిష్యత్తు పాలకులు అందుకు కృషి చేయాలి’ అని అన్నారు.

సాంఘిక, ఆర్థిక సమానత్వ కోసం కులగణన అవశ్యకం. భారత రాజ్యాంగం  కులగణనను నిర్వహించడాన్ని సమర్థిస్తోంది. ఆర్టికల్ 340 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులను పరిశోధించడానికి, ప్రభుత్వాలు తీసుకోవలసిన చర్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలని ఆదేశించింది.

 సమాజంలో అంతర్భాగం కులం

కులం సమాజాన్ని, సామాజిక దొంతరలుగా విభజించే వ్యవస్థ. భారతీయ సమా జంలో కులం అంతర్భాగం. కులవ్యవస్థ వ్యక్తి పుట్టుకతో నిర్ణయమైన వర్గ నిర్మాణం. వ్యక్తిగత జీవనశైలితో సాధించే సామాజిక గౌరవం ద్వారా కులం ప్రాథమికంగా నిర్వచించబడుతుంది. భారత ప్రభుత్వం పార్ల మెంటులో ప్రకటించినట్లు దేశంలో 3000 కులాలు, 25000 ఉప కులాలు ఉన్నాయి.

నిజానికి భారతదేశంలో మనం చూస్తున్న కుల వ్యవస్థను జాతి అంటారు. వేదకాలంలో సమాజంలో నాలుగు వర్ణాలు బ్రా హ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రులుగా ఉండేవి. వర్ణాల నుండే కులాల ఏర్పడ్డాయనే వాదన ఉంది. క్రీ.పూ. 1500లో ఆర్యులు భారతదేశానికి వచ్చారు. సామాజిక చారిత్రక సిద్ధాంతం ప్రకారం భారతదేశంలో కుల వ్యవస్థ ఆర్యుల రాకతో ప్రారంభమైంది.

బ్రిటీష్ హయాంలో తొలి కులగణన 

భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1872లో జనాభా లెక్కలు ప్రారంభం అయ్యాయి. సామాజిక -ఆర్థిక,కుల గణన-(ఎస్‌ఈసీసీ) మొట్టమొదట 1931లో  నిర్వహించారు. ఇది గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లోని భారతీయ కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమాచారాన్ని సేకరించడం, లేమి సూచికలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 1941లో కూడా కులగణన చేయాలని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించి సమాచారం సేకరించింది కానీ రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఆ సమాచారాన్ని బయటపెట్టలేకపోయింది.

1951 తర్వాత జాతీయ ఐక్యతను పెంపొందించడానికి కులగణన సేకరణను నిలిపివేయాలనీ అప్పటి ప్రభు త్వం నిర్ణయించింది. 1951 నుండి 2011 వరకు స్వతంత్ర భారతదేశంలోని ప్రతీ జనాభా గణనలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రచురించారు. దేశవ్యాప్తం గా బీసీలు 52 శాతం ఉన్నారన్న మండల్ కమిషన్ రిపోర్ట్ కూడా 1931 కులగణనను ఆధారంగా చేసుకుని చేసినదే. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న నిబంధనను దృష్టిలో ఉంచుకొని ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను మండల్ కమిషన్ సిఫారసు చేసింది.

సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం

నేషనల్ శాంపిల్ సర్వే 2011 -12 లెక్కల ప్రకారం అగ్రకులాలతో పోల్చినప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీలు చాలా వెనుకబడి ఉన్నారని తెలుస్తుంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2016-17 ప్రకారం దేశంలో 28 శాతం ప్రజలు మల్టీ డైమెన్షనల్ పార్టీ పరిధిలో ఉన్నారు. ఎస్టీలు 50శాతం, ఎస్సీలు 33 శాతం, ఓబీసీలు 27 శాతం పేదరికంలో ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే 2017 -18 ప్రకారం విద్యారంగంలో ఎస్టీలు 3 శాతం, ఎస్సీలు 4 శాతం,ఓబీసీలు 6 శాతం, జనరల్  కేటగిరీలో 12 శాతం గ్రాడ్యుయేట్స్ ఉన్నారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జనరల్  కేటగిరీలో 3 శాతం, ఓబీసీలో 1శాతం మాత్రమే ఉన్నారు. జనరల్  కేటగిరిలో 30శాతం, ఓబీసీలో 20 శాతం, ఎస్టీలు 12 శాతం మాత్రమే స్థిరమైన ఉద్యోగాలు పొందుతున్నారు. రోజువారీకూలీలు ఎస్టీలు 29 శాతం, ఎస్సీలు 38 శాతం, ఓబీసీలు 20 శాతం, జనరల్ కేటగిరీలో 11శాతం మాత్ర మే ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 2021 లెక్కల ప్రకారం 52.7 శాతం మంది జనరల్ కేటగిరీకి చెందిన వారే ఉన్నారు. అందులోకూడా అధిక వేతనం అందుకునే ఉన్నత ఉద్యోగాల్లో 64శాతం పైగా జనరల్ కేటగిరీ వారు ఉన్నారు.

ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు అధికారికంగా వెల్లడించినవే. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే అన్ని రంగాల్లో జనరల్ కేటగిరీ వారితో పోల్చితే ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడ్డారని మనకు అర్థమవుతుంది.

పార్లమెంటు సాక్షిగా హామీ

2018లో పార్లమెంట్ సాక్షిగా అప్పటి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారతదేశంలో రాబోయే జనగణనలో కులగణన తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తోంది. 2021లో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం రాబోయే జనాభా గణనలో ఎస్సీ, ఎసీ,్ట కులగణన మాత్రమే చేస్తామని, ఓబీసీల కులగణన చేయబోమని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని, బీసీల రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. 2011 లో నాటి యూపీఏ హయాంలో కుల గణన కోసం ప్రణాళికలు తయారు చేసి నిధులు కూడా కేటాయించింది. వామపక్ష పార్టీలైన సిపిఐ, సిపిఎంలు కుల గణనకు మద్దతుగా తీర్మానాలు చేశాయి.

బీహార్‌లో తొలి కులగణన

బీహార్ రాష్ట్రం 2023 జనవరిలో మొట్టమొదట కులగణన చేసి ఫలితాలను ప్రకటించింది. రాష్ట్ర జనాభాలో మూడింట రెండు వంతుల (63శాతం) మంది వెనుకబడిన వర్గాలకు చెందిన వారున్నారని ఆ సర్వేలో తేలింది.

కులగణన వల్ల సమాజంలో కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని, కులాల వారీగా ప్రజలను వర్గీకరించడం అంటే వ్యక్తిగత హక్కులు హరించడమేనని, కులాలను నిర్వచించడం కష్టమని, ఇది సమాజంలో గందరగోళం, వివాదాలకు దారితీసి దేశ సమగ్రతకు భంగం కలిగిస్తుందనే వాదన కూడా ఉంది. కులగణనకు అనుకూలంగా,వ్యతిరేకంగా వాదనలు ఉన్నప్పటికీ, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడానికి, వనరుల సమాన పంపిణీని నిర్ధారించడానికి వెనుకబడిన కులాల జనాభా సమాచారం అవసరం. 

సమగ్ర కులాల సమాచారం సామాజిక అసమానతలను పరిష్కరించడంలో, సమానత్వ సమాజాన్నిరూపొందించడంలో సహాయపడుతుంది.

కాంగ్రెస్ హామీ మేరకు..

భారతదేశంలో మొట్టమొదటిసారిగా కులగణన బీహార్ రాష్ట్రంలో జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కులాల వివరాలు సేకరించింది. దీనికి చట్టబద్ధత లేకపోవడంతో న్యాయస్థానంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించింది.

అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం హర్షణీయం. కుల వివరాలను అంచనా వేయడానికి 2024 నవంబర్ 6 నుండి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం జనాభా సామాజిక,ఆర్థిక,విద్య, రాజకీయ,వ్యక్తిగత గృహాల్లోని సభ్యుల వివరాలు, వారి కులం, ఉపకుల స్థితి, ఆర్థిక స్థితి, రాజకీయ ప్రాతినిధ్యం , ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నావళిని ఈ సర్వే కలిగి ఉంటుంది. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సమాచారాన్ని సేకరించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఈ కులగణన ఎంతో ఉపయుక్తం కానుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కులగణన దేశానికి ఆదర్శం కావాలని, తద్వారా దేశవ్యాప్తంగా కులగణన జరిగి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి దోహద పడుతుందని ఆశిద్దాం.

- వ్యాసకర్త సెల్: 9848377734