calender_icon.png 22 November, 2024 | 5:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన రోల్‌మాడల్

22-11-2024 02:04:13 AM

వారిది గడీల పాలన.. మాది ప్రజా పాలన

  1. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ కనీసం గ్రూప్ 1 నిర్వహించలే 
  2. బీఆర్‌ఎస్ కుటిల యత్నాలను అడ్డుకుని ఉద్యోగాల భర్తీ 
  3. చారిత్రక కుల గణనను అడ్డుకోవాలనే బీఆర్‌ఎస్ కుట్ర 
  4. సమసమాజ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం పునాదులు  
  5. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి  

* ప్రభుత్వరంగ సంస్థలు, దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆదానీకి అప్పనంగా కట్టబెడుతున్నారు. అదానీపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నది. పారిశ్రామికవేత్తలెవరైనా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రావచ్చు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నది తమ విధానం.

  1.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): గతంలో గడీల పాలన సాగిం దని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టంచేశారు. ప్రజలతో మమేకమవుతూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని, అందుకే గాంధీభవన్‌లో ప్రజలు, కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా తాను, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యను అందించేం దుకు సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని యావత్ క్యాబినెట్ ఆలోచన చేసి హాస్టల్ విద్యార్థుల చార్జీలను 40 శాతం పెంచినట్టు గుర్తుచేశారు.

గత పాలకులు 10 ఏళ్లలో ఈ అంశాన్ని పక్కన పడేశారని మండిపడ్డారు. పేదల గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, రూ. 5 లక్షల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వ విజయమని అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 50 వేల ఉద్యోగాల భర్తీ చేశామని, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో గ్రూప్-1 నిర్వహించలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ కుటిల ప్రయత్నాలను తట్టుకుని ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు స్పష్టంచేశారు. కులగణన చారిత్రక నిర్ణయమని, దీనిని అడ్డుకోవాలని  దోపిడిదారులు సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన దేశానికి రోల్‌మాడల్‌గా నిలుస్తుందని చెప్పారు. సర్వే పూర్తయితే ఇన్నాళ్లు దోచుకున్న వారి ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. ప్యూడల్ వ్యవస్థ నుంచి బయటికి తెచ్చి సమ సమాజ నిర్మాణానికి ప్రజాప్రభుత్వం పునాదులు వేస్తోందని పేర్కొన్నారు. వనరులు ప్రజలకు సమానంగా పంచాలనుకునేవారు కులగణనకు మద్దతు ఇవ్వాలని కోరారు. 

అదానీపై రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ సమాధానం చెప్పాలి 

ప్రభుత్వరంగ సంస్థలు, దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆదానీకి అప్పనంగా కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. అదానీపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నదని స్పష్టంచేశారు.

పారిశ్రామిక వేత్తలెవరైనా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి రావచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నదే తమ విధానమని, రాహుల్‌గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగానే తాము నడుచుకుంటున్నామని పేర్కొన్నారు.  

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే ప్రయత్నం.. 

ఒకప్పుడు పరిశ్రమలు, ఉత్పత్తి అంటే అదాని, అంబానీ అని మాత్రమే అనుకునేవారని.. కానీ, తమ ప్రభుత్వం వారిని కిందికి దించి స్వయం సహాయక సంఘాల సభ్యులతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నదని భట్టి స్పష్టంచేశారు. మహిళలకు రూ.లక్ష కోట్ల వరకు వడ్డీలేని రుణాలు ఇప్పించి వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి వాటిని మహిళా సంఘాలకు అప్పగించి.. వారు ఆర్టీసీకి బస్సులు లీజుకు ఇచ్చి ఆదాయం పొందేలా చూస్తామని చెప్పారు. ప్రపంచస్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు మూలనపడ్డ 65 ఐటీఐలను అడ్వాన్స్ సెంటర్లుగా తీర్చి దిద్దుతున్నట్టు వెల్లడించారు. 

324 వినతులు.. అక్కడిక్కడే పరిష్కారానికి ఆదేశాలు 

మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమానికి 3౨౪ మంది తమ సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు విన్నవించుకున్నారు. వీటిలో డిప్యూటీ సీఎం కార్యాలయానికి సంబంధించి- 28, సీఎం కార్యాలయానికి సంబంధించినవి- 199, రెవెన్యూ - 41, సివిల్ సప్లయ్ - 9, రవాణాశాఖ, బీసీ సంక్షేమశాఖ- 4, పర్యాటక శాఖ- 2, దేవాదాయ, అటవీశాఖ- 8, జీహెచ్‌ఎంసీ -6, వ్యవసాయ శాఖ-8 దరఖాస్తులు ఉండగా, పీసీసీ కార్యాలయానికి సంబంధించినవి 19 దరఖాస్తులు ఉన్నాయి.

కాగా, పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించినా ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదని జూనియర్ లెక్చరర్ అభ్యర్థులు డిప్యూటీ సీఎంను కలవగా.. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కోలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజినీర్ల ఖాళీలను భర్తీ చేయాలని సంబంధిత శాఖ ఉద్యోగులు కోరగా, వాటిని వెంటనే పరిశీలన చేస్తామని తెలిపారు.

తన తల్లి మాడుగు కళ్యాణి బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుందని, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కుమారుడు మహేశ్ డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం ఆసుపత్రి బిల్లులు తీసుకొచ్చి.. ఆ మొత్తానికి ఎల్వోసీ తన వద్ద తీసుకోవాలని, దానిని పర్యవేక్షించాలని తన పీఏలను ఆదేశించారు.

ఏమైనా ఇబ్బంది ఉంటే తనకు ఫోన్ చేయాలని సూచించారు. జూపార్కులో డైట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని సిబ్బంది కోరగా, వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. లాండ్రీ షాపునకు రూ.20 వేల వరకు కరెంట్ బిల్లు వచ్చిందని ఓ వినియోగదారుడు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకురాగా.. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు అక్కడి నంచే ఫోన్ చేసి ఆదేశించారు.