calender_icon.png 12 February, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో కులగణన రీసర్వే: భట్టి

12-02-2025 07:04:31 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం నిర్వహించిన కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క పేర్కొన్నారు. కులగణన సర్వే చేసి లెక్కలు శాసనసభలో ప్రవేశపెట్టామని, సర్వేలో 3.1 శాతం మంది పాల్గొన్నలేదని తెలిపారు. ఈనెల 16 నుంచి 28వ తేదీ వరకు మరోసారి కులగణన రీసర్వే నిర్వహిస్తామని చెప్పారు. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నామని ఈసారి సద్వినియోగం చేసుకోవాలని భట్టి సూచించారు. రాష్ట్ర జనాభా లెక్కల్లో వచ్చేలా చూసుకోవాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం జరుగుతుందన్నారు.

శాసనసభలో బిల్లు ఆమోదం చేసి చట్టబద్ధం చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. కులగణన బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంటులో ఆమోదానికి కృషి చేస్తామని భట్టి వెల్లడించారు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకులను కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని పోతామన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం మా లక్ష్యమని, దశాబ్దాల ఓబీసీల కలలను నిజం చేసేందుకు కృషి చేస్తామని  డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. రిజర్వేషన్లపై రాజకీయపరంగా కుట్రలు చేస్తే తిప్పికొడతామని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి పక్కన పెట్టి మద్దతు పలకాలని కోరుతున్నామన్నారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నవారికి న్యాయం చేయాలనేది ఆలోచన అని, లక్ష్యాలు చేరడానికి భారం మోయడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని భట్టీ విక్రమార్క చెప్పారు.