ఓసి, ఎస్ సి, ఎస్ టి, ముస్లిం మైనార్టీల జనాభా పెరిగి బీసీల జనాభా తగ్గడం ఏమిటి..?
బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర..
తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదిక తప్పుల తడకగా ఉన్నదని, బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి కుట్రలో భాగమేనని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలకర రవికుమార్ అన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకే అగ్రవర్ణాల జనాభాను పెంచి చూపారని ఆరోపించారు. 2011 తెలంగాణ జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల 70 లక్షలు ఉండగా దానిలో బీసీ జనాభా కోటి 84 లక్షలుగా చూపించారని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదికలో బిసి జనాభా కోటి 64 లక్షలుగా తగ్గించి చూపారని మండిపడ్డారు.
బీసీల జనాభా పెరగాల్సి ఉండగా తగ్గించి చూపటం రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు. 2011 లో ఓసీల జనాభా 10 శాతం లోపే ఉండగా ప్రస్తుతం15.79 శాతం పెరిగినట్లు చూపించారని, ఓసీలు పెరగటం బీసీలు తగ్గడం ఏమిటని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సర్వే ఫలితాలను పూర్తిగా సమీక్షించి నిజమైన గణాంకాలను వెల్లడించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలన్నారు. విద్యా, ఉద్యోగ రంగాలలో 52 శాతానికి పెంచాలన్నారు. జనాభా తగ్గిందని బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపచేస్తామని, బీసీల తిరుగుబాటు తప్పదని రవికుమార్ హెచ్చరించారు.