బీఆర్‌ఎస్ నిర్వహించిన ఎస్‌కేఎస్ నివేదిక ఏమైంది?
ఆ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు?
బీఆర్‌ఎస్‌తో చీకటి ఒప్పందమే కారణమా?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): కులగణన సర్వే పేరుతో కాంగ్రెస్ పార్టీ టైంపాస్ రాజకీయాలు చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన ఆయన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు.
కులగణన విషయంలో రాష్ర్ట ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమైనదని, ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలను ఆలస్యంగా నిర్వహిండాచానికి, తప్పించుకునే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే(ఎస్‌కేఎస్)లో కులగణన సహా అన్ని వివరాలను పొందుపర్చారని ఆయన పేర్కొన్నారు.
ఆనాడు వేరే దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రజలను సైతం రప్పించి నిర్వహించిన కుటుంబ సర్వే నివేదిక ఏమైందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎలాగూ ఆ నివేదికను బయటపెట్టలేదని, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎందుకు బయటపెట్టడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు మధ్యనున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ఆ నివేదికను బయటపెట్టడం లేదా అని ప్రశ్నించారు.
అసలు ఎస్‌కేఎస్ సర్వేతో ఏం ప్రయోజనం కల్గిందని నిలదీశారు. ఆ నివేదిక ఉండగా మళ్లీ కుల గణన సర్వే పేరుతో రూ.150 కోట్ల నిధులు కేటాయించి 60 రోజుల గడువు పెట్టడమెందుకని ప్రశ్నించారు. ఎస్కేఎస్ నివేదిక నాటికి, నేటికీ తెలంగాణ ప్రజల కులం ఏమైనా మారిందా మరి దేని కోసం ఈ డ్రామాలాడుతున్నారని నిలదీశారు. కాంగ్రెస్ నేతల తీరును చూస్తుంటే కులగణన ఓ ఫేక్ అనిపిస్తోందన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామని ఆ పార్టీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, గ్యారంటీలపై ప్రజలు నిలదీస్తున్నారని తెలిసి కులగణన పేరుతో టైం పాస్ చేస్తూ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదికను బయట పెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు.