calender_icon.png 5 November, 2024 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణన వల్ల కొన్ని వర్గాలకు తీవ్రమైన అన్యాయం

05-11-2024 04:58:08 PM

ఆందోళన వ్యక్తం చేసిన పలు బ్రాహ్మణ సంఘాల నేతలు..

ముషీరాబాద్  (విజయక్రాంతి):  కులగణన చేసే సందర్భంలో కులాలను విభజించి వివరాలు సేకరించే పద్ధతి సరికాదని, కులగణన వల్ల కొన్ని వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉందని పలు బ్రహ్మణ సంఘాల నాయకులు గిరి ప్రసాద్ శర్మ, చింతపల్లి మంగళపతి రావు, దర్శనం శర్మ, మురుకుంట్ల రాజేశ్వర శర్మ, ఉప్పల బాలసుభ్రహ్మణ్యంలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తొందర పడితే ఇరుకున పడుతుందని, అగ్రకులాల జాబితాలో ఉండి కడు పేదరికంతో మగ్గుతున్న బ్రాహ్మణ వైశ్య ఇతర కులాలకు అన్యాయం జరగడం కాకుండా కులాల మద్య విబేధాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు బోర్పట్ల హనుమంతాచార్య, విఎస్ఆర్. మూర్తి, మల్లాది చంద్రమౌళి, పి.భీమ్ సేన్ మూర్తి, సత్యనారాయణ మూర్తిలతో కలసి వారు మాట్లాడుతూ.. దీని వల్ల కులాల మధ్య ఐక్యత లోపించి వేరు వేరు వర్గాలుగా ప్రభుత్వమే విభజించే విధానం సరికాదని, దీనిని సవరించాలన్నారు. బ్రాహ్మణ వైశ్య ఇతర అగ్రకులాలలోని శాఖల జోలికి వెళ్లకుండా కేవలం రాజ్యాంగంలో ఉన్నట్లుగా కులాలను గణన చెయ్యాలన్నారు.

రాజ్యాంగంలో ఎక్కడ ఉపకులాల ప్రస్తావన లేదు కనుక ప్రభుత్వం ఈ సర్వేను ఆపేసి ముందు ప్రజల అభిప్రాయాలు తీసుకుని తర్వాత కమిషన్ ను నియమిస్తే బాగుంటుందన్నారు. అలాగే కులగణన కంటే ముందు కులగణన చేసేందుకు ప్రజల అభిప్రాయ సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒక కులానికి పెద్ద పీటవేయ్యడం సబబు కాదని, అలాగే గత ప్రభుత్వం కూడా దళిత బందు పెట్టి నేడు ఆ ప్రభుత్వమే లేకుండా పోయిందన్నారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కులానికి పెద్ద పీట వేసి ప్రజల్లో చులకన కావద్దని విజ్ఞప్తి చేశారు.