అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని నాయకులు ప్రకటించారు. మరోవైపు నాలుగేళ్లుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షలమంది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి.
కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్నవారికి ఇచ్చారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు.
తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే జరపాలని కాంగ్రెస్ ప్రభు త్వం నిర్ణయించడం అభినందనీయం. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి శాసనసభ ఏకగీవ్రం గా ఆమోదించడం విశేషం. ఈ సర్వేలో ఆయా వర్గాలవారీగా ప్రజల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాల పూర్తి సమాచారం ప్రభు త్వం సేకరించనుంది. ఎందరు, ఏ సామాజిక వర్గానికి చెందిన వారు, వారి ఆర్థిక పరిస్థితితోపాటు విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? వంటి వివరాలు సేకరించనున్నారు.
దీనివల్ల ప్రస్తుతం అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకే చేరుతున్నాయా లేదా ఏమైనా అవక తవకలు జరుగుతున్నాయా? అన్న విషయాలపై ఒక స్పష్టత రావడమేకాక ప్రభుత్వం అమలు చేసిన కొత్త పథకాల విషయంలో ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారమూ దొరుకుతుంది. దీంతో అన్యాయానికి గురైన వర్గాలకు న్యా యం చేకూరే అవకాశం ఉం టుంది. వీటితోపాటు రాజకీయ పరంగా ‘ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది, ఎవరికి ఎంత ప్రా ధాన్యం ఇవ్వాలి’ అన్న అంశంపైనా క్లారిటీ వస్తుంది. ఇదే పద్ధతిలో ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పడ్డ ఎన్డీఏ ప్రభుత్వ మూ సత్వరమే సమగ్ర కులగణన చేపట్టి సామా జికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు చేయూత నివ్వాలి. గత ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు ఎక్కువ శాతం ఎన్డీఏకి ఓట్లు వేసిన సంగతి మరిచిపోకూడదు.
బలమైన నాయకత్వం అవసరం
గత ఏడు దశాబ్దాల పాలనలో ఎవరి హక్కులకోసం వారు, ఎవరి ఆధిపత్యం కోసం వారు పరిమితవగా, ఇతరులకు కరివేపాకులా మిగిలిపోతున్న బీసీ వర్గం, తమ హక్కులు తాము దక్కించుకోవాలంటే చేయవలసింది ఏమిటనే దానికి సరైన సమాధా నం కావాలి. బీసీ కులాల అస్తిత్వ నిర్మాణం చక్కబడాలి. వీరిమధ్య ఐక్యత పెరగాలి. ఈ రెండూ జరగడానికి వీలుగా దామాషా హక్కులకోసం సమష్టి కృషి కొనసాగిస్తూనే, అవకాశాలను బీసీ కులాల మధ్య సమానంగా పంపిణీ చేయాలి. సరైన నాయకత్వ నిర్మాణం బీసీలకు కావాలి. జాతీయస్థాయిలో, బీసీలకు నిజమైన గుర్తింపు దక్కాలి. జాతీయంగా బీసీ సంఘాన్ని వ్యవస్థీకృతం చేయకుండా ఇది వీలు కాదు. అంతిమంగా, బీసీ నాయకత్వానికి బలమైన రాజకీయ వేదిక నిర్మాణం జరగాలి. అలా బీసీలు రాజ్యాధికారం చేపట్టాలి.
దీంట్లో ఎవరి దామాషా హక్కులు వారికి దక్కాలి. ఇదే సమసమాజ స్థాపనకు దోహదం చేస్తుంది. బీసీ హక్కు లు వారికి దక్కేలా రాజ్యాంగ నిర్మాణం జరగలేదు. రూపకల్పనలో బీసీల సమగ్రాభివృద్ధి దృష్టి కొరవడింది. బీసీలు ఎవరు, ఎందరు, వారి స్థితిగతులు ఏమిటి, ఎటువంటి రాజ్యాంగ ప్రమాణాల ప్రకారం వారిని గుర్తించాలో స్పష్టంగా నిర్వచించకుండానే రాజ్యాంగ నిర్మాణం జరిగింది. కేవలం ఎస్సీ, ఎస్టీల హక్కులకే రక్షణ కల్పించారు. నేడు ఏయే కీలక రంగాల్లో, ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉందనే కోణాన్ని సంబంధిత గణాంకాలతో పరిశీలించాలి. నిజానికి ఈ గణాంకాలే పై ఆరోపణలను నిర్ద్వంద్వంగా రుజువు చేశాయి. కులాలు, ఉపకులాలుగా విడిపోయిన బీసీలుగా అందరూ ఐక్యం కావాలి. కేవలం 8 శాతం ఉన్న అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన బీజేపీ ప్రభుత్వం 57 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లకే పరిమితం చేశారు.
సమగ్ర విధానం రూపొందాలి
‘ఇతర వెనుకబడిన తరగతులు’ (ఓబీసీ) అనేది దేశంలో చారిత్రకంగా అట్టడుగున ఉన్న సామాజిక వర్గం. విద్యాపరంగా వీరు బాగా వెనుకబడ్డారు. భారత ప్రభుత్వం వీరి ని ప్రత్యేకవర్గంగా గుర్తిస్తున్నది. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి వారికి విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వే షన్ వంటి ప్రత్యేక సదుపాయాలను అందిస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా, ఓబీసీలు విద్య, రాజకీయాలు, వ్యాపారం సహా వివిధ రంగాలలో నిర్లక్ష్యానికి గురయ్యారు. ఓబీసీల్లో 70 శాతం ఇప్పటికీ పేదరికంలోనే వుండి వివక్ష, హింసకు గురవుతున్నారు. దేశంలో ఓబీసీలది సంక్లిష్టమై న బహుముఖ సమస్య. వారు వివిధ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించిన ప్పటికీ అనేక సవాళ్లు మిగిలి ఉన్నాయి. వీటి పరిష్కారానికి నిశ్చయాత్మక కార్యాచరణసహా అసమానతలు, వివక్షతలను తొలగిం చే చర్యలతో సమగ్ర విధానం ఏర్పరచాలి. అత్యంత వెనుకబడిన కులాలు, సంచారజాతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయవల సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తున్నది.
కులవృత్తులు మటుమాయం
సమాజం ఎప్పటికప్పుడు మారుతున్నది. ప్రజల్లోనూ దీనికి అనుగుణమైన మార్పులు వస్తున్నాయి. సైన్స్, టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. అన్ని రంగాల్లో యాంత్రీకరణ పెరుగుతున్నది. ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక, వ్యవ సాయ, సాంస్కృతిక రంగాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలకూ విస్తరిస్తున్నది. ఈ పరిణామ క్రమంలో కులవృత్తులు,- హస్తకళలు తమ ఆస్తిత్వాన్ని కోల్పోతుండటం దురదృష్టకరం. ఇంతవరకు ఈ వృత్తులపైనే ఆధార పడిన కులాలు, వర్గాలకు యాంత్రీకరణ,- కార్పొరేటీకరణ ఫలాలు దక్కాలి. కానీ, ప్రస్తుత వ్యవస్థలో అలా జరగడం లేదు. స్టీల్-, ఐరన్ పరిశ్రమలతో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి కులాలు వృత్తులను కోల్పోయా యి. ప్లాస్టిక్ పరిశ్రమ కారణంగా మేదరి, కుమ్మరి వృత్తులు మరుగున పడ్డాయి. జేసీబీలు, హిటాచీ మెషిన్లతో వడ్డెర్ల బతుకులు ఆగమై కూలీలుగా మారారు. అలాగే, మిగిలిన కులవృత్తులు కూడా.
ఉత్సవ విగ్రహాలుగా కార్పొరేషన్లు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతి దరఖాస్తుదారునికి సబ్సిడీ రుణాలు ఇస్తామని ప్రకటించారు. మరోవైపు నాలుగేళ్లుగా కొత్త రుణాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకోవడానికి లక్షలమం ది ఎదురు చూస్తున్నారు. బీసీ కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మారాయి. కులాల సమస్యలపై అవగాహన ఉన్నవారు తమకు కావలసిన పథకాలను డిజైన్ చేయగలరు. కానీ, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల నియామకం అస్తవ్యస్తంగా తమ చెప్పుచేతల్లో ఉన్నవారికి ఇచ్చారు. సబ్సిడీ రుణాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించడం లేదు.
కార్పొరేషన్లు ఏర్పాటు చేయ డం ద్వారా ఆయా కులాలు ఎదుర్కొంటున్న సమస్యలను కిందిస్థాయిలో అర్థం చేసుకుని, పరిష్కరించే అవకాశం లభిస్తుంది. మిగతా కులాలకు ఎంబీసీ, సంచార జాతుల కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. యాంత్రీకరణతో కార్పొరేట్ ప్రాబల్యం పెరిగి పోతున్నది. కార్పొరేషన్ల ద్వారా ప్రభు త్వం సబ్సిడీ రుణాలు ఇవ్వకపోగా, బీసీలకు లక్ష-, 2 లక్షల రుణాలు ఇవ్వడానికి బ్యాంకు లు ముందుకు రావడం లేదు. కానీ, బడా కంపెనీలకు, పారిశ్రామిక వేత్తలకు వేలకోట్ల రుణాలు ఇచ్చి, వాటిని కట్టకపోతే మాఫీ చేస్తున్నారు.
ఇప్పటికైనా బ్యాంకులు తమ వైఖరి మార్చుకుని బీసీలకు సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలి. అందుకు బ్యాం కర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి దరఖాస్తుదారుకు బ్యాంకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆకలి, అజ్ఞానం, అమాయకత్వం, అనారోగ్యం, పేదరికం లేని సమాజ నిర్మాణం జరగాలంటే జాతి, వనరులు, సంపద, అధికారం అన్ని వర్గాలకూ సమానంగా దక్కాలి. శ్రమ సంస్కృతి పెరగాలి. మానవ వనరులు పూర్తి స్థాయిలో వాడుకోవాలి. ఈ రకంగా శ్రమకు తగ్గ ప్రతిఫలం ప్రతి ఒక్కరికీ దక్కాలి.
డా. యం.సురేష్‌బాబు