calender_icon.png 27 December, 2024 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి డిక్లరేషన్ మేరకే కులగణన

02-11-2024 01:05:18 AM

  1. సర్వే వివరాలతోనే ప్రజలకు పథకాల లబ్ధి 
  2. మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్లుగా, గతేడాది నవంబర్ 10న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ హామీ మేరకు రాష్ట్రంలో సమగ్ర కులగణన ప్రారంభిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రజలకు ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.

రాష్ర్టంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలను ప్లాన్ చేసి అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సర్వే కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.150 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు.

కులగణన కోసమే బీసీ కమిషన్ చైర్మన్‌గా నిరంజన్, సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిని నియమించినట్లు తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి 85 వేల మంది ఎన్యూమరేటర్లు కులగణనలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రతీ 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడు ఉంటారని తెలిపారు.

గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఇంటింటి సమగ్ర సమాచార సేకరణ చేసి డాటా ఎంట్రీ చేస్తారని అన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి చెప్పారు.

కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ సర్వే ద్వారా అన్ని రకాల పథకాలు అందిస్తామన్నారు. సమగ్ర సమాచారం ప్రభుత్వంతో ఉండటం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు మరింత సులువుగా మారుతుందన్నారు.