- ఏసీబీ విచారణలో అర్వింద్‌కుమార్
- ఏడున్నర గంటలపాటు సాగిన విచారణ
- నేడు విచారణకు హాజరుకానున్న కేటీఆర్
హైదరాబాద్, జనవరి8 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ఆదేశాలతోనే నగదు బదిలీ చేశామని ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. అర్వింద్‌కుమార్‌ను బుధవా రం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో సుమారు ఏడున్నర గంటలపాటు ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది.
రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి హెచ్‌ఎండీఏ చెల్లించిన నేపథ్యంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమా చారం. రూ.55 కోట్లు ఎఫ్‌ఈవో సంస్థకు బదిలీ వెనుక ఉన్న అసలు కోణం ఏమిటి, ఈ నిర్ణయానికి కారకులెవరు, నగదు బదిలీకి ఆర్బీఐ అనుమతి ఉందా అంటూ ప్రశ్నించారని తెలిసింది.
కేటీఆర్ ఆదేశాలు ఇవ్వడంతోనే నగదు బదిలీ చేశామని అర్వింద్ వాంగ్మూలం ఇచ్చినట్లుగా సమాచారం. ఈ కేసులో ఏ2గా ఉన్న అర్వింద్‌కుమార్ నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్
మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఏసీబీ కార్యాలయానికి రానున్నారు. తన న్యాయవాదితో వచ్చేందుకు ఆయనకు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్వింద్‌కుమార్ వాంగ్మూలం ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ కోసం ప్రశ్నలను సిద్ధం చేసినట్లు సమాచారం. పూర్తిగా కేటీఆర్ ఆదేశాల వల్లే తాము చెల్లింపులు చేసినట్టు అర్వింద్ ఏసీబీకి చెప్పినట్టు తెలుస్తున్న నేపథ్యంలో కేటీఆర్ విచారణపై ఆసక్తి నెలకొంది.
సోమవారం ఏసీబీ విచారణకు వచ్చిన కేటీఆర్ తన న్యాయవాదులను అనుమతించకపోవడంతో తిరిగి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన క్వాష్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన తర్వాత ఏసీబీ మరోసారి విచారణకు పిలిచింది. ఈ కేసులో అటు ఏసీబీ, ఇటు ఈడీ విచారణల పర్వం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో కేసు వ్యవహారం హాట్‌హాట్‌గా మా రిపోయింది. నేటి విచారణకు వచ్చిన తర్వా త కేటీఆర్ నుంచి స్టేట్‌మెంట్ మాత్రమే తీసుకుంటారా లేక అరెస్టు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.