calender_icon.png 7 February, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో సినీ ఫక్కిలో నగదు చోరీ

07-02-2025 04:50:36 PM

రూ 4.40 లక్షలు ఎత్తుకెళ్లిన అగంతకులు..

సీసీ ఫుటేజీలో చిక్కిన అగంతకుల చిత్రాలు..

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు అగంతకులు రెచ్చిపోయి సినీ ఫక్కీలో అక్కడ నిలిపి ఉంచిన బైక్ లో ఉన్న రూ 4.40 లక్షలను ఎత్తుకెళ్లారు. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామి అనే వ్యక్తి శుక్రవారం తన అన్న కూతురు పెళ్లి ఉండడంతో బెల్లంపల్లి ఎస్బిఐ బ్యాంకులో రూ 4.40 లక్షలు డ్రా చేశారు. నగదు తన బైక్ ట్యాంక్ కవర్ లో పెట్టుకొని కూరగాయలు కొనేందుకు నూతన కూరగాయల మార్కెట్ వద్దకు వెళ్లారు. తన బైక్ అక్కడే నిలిపి ఎదురుగా కూరగాయలు కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా అగంతకులు నెంబరు ప్లేటులేని వాహనంపై అక్కడికి వచ్చి వెంకటస్వామి నిలిపి ఉంచిన బైక్ లో గల రూ 4.40 లక్షలు ఎత్తుకెళ్లిపోయారు.

నగదు ఎత్తుకెళ్లిన అగంతకులు బ్యాంకులో  డబ్బులు డ్రా చేసిన సమయం నుండి వెంబడిస్తున్నారు. ఈ చిత్రాలు బెల్లంపల్లి బజార్ ఏరియాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. కొత్త కూరగాయల మార్కెట్ భవనం వద్ద బైకుల నుండి నగదు ఎత్తుకెళ్లిన అగంతకులు నెంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పాత బస్టాండ్ వైపు మెయిన్ రోడ్డుపై వెళ్లిన చిత్రాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. బాధితుడు దుర్గం వెంకటస్వామి పోలీసులను ఆశ్రయించడంతో వన్ టౌన్ సిఐ నీలాల దేవయ్య ఈ సంఘటనపై తనదైన శైలిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఏది ఏమైనా అగంతకులు నగదు ఎత్తుకెళ్లిన తీరు బెల్లంపల్లి పట్టణంలో కలకలం రేపుతోంది.