- ఒక్కో తరగతి సీటుకు ఒక్కో ధర?
- సీటు ఇప్పిస్తామంటూ ఫైరవీల దందా
- చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
నాగర్‌కర్నూల్, జూలై 18 (విజయక్రాంతి): నిరుపేదలు, తల్లీదండ్రులు లేని మధ్య తరగతికి చెందిన ఆడ పిల్లల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు పైరవీకారులకు కల్పవృక్షంలా మారాయి. కస్తూర్బాల్లో మీ పిల్లల కు సీటు ఇప్పిస్తామంటూ కొత్త దందాకు తెరదీశారు. ఒక్కో తరగతికి ఒక్కో రేటు వసూలు చేస్తూ అమాయక తల్లీదండ్రులను నిలువునా ముంచుతున్నారు. ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కస్తూర్బా పాఠశాలల్లో ఇదే తంతు నడుస్తోందని ఆరోపిస్తున్నారు.
ఆఫ్‌లైన్ అడిషన్లతో క్యూ
కస్తూర్బా పాఠశాలల్లో ఆఫ్‌లైన్ అడ్మిషన్లు కావడంతో తమ బిడ్డలను చేర్పించేందుకు పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. ఉచిత నాణ్యమైన విద్య అందు తుండటంతో ప్రస్తు తం కస్తూర్బా పాఠశాలకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే రాజకీ య నా యకులు పైరవీకారుల అవతా రం ఎత్తారు. విద్యార్థినులను చేర్చేందుకు ఒక్కో తరగ తికి ఒక్కో ధర నిర్ణయిస్తున్నారు. పైస్థాయి అధికారులను మచ్చిక చేసుకుని పాఠశాల ఎస్‌వోలకు ఫోన్ చేయించి అడ్మిషన్ ఇప్పిస్తు డబ్బులు డండుకుంటున్నారు.
ప్రైవేటు కార్పొరేటు పాఠ శాలల దోపిడీని తట్టుకోలేని నిరుపేదలు కస్తూర్బా (కేజీబీవీ) పాఠశాలలో చేర్పించేందుకు తప్పనిసరి పరిస్థితిలో పైరవీకారులను నమ్ముతున్నారు. ఈ పాఠశాలల్లో అనాథ పిల్లలను మాత్రమే చేర్చుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం వారికే సీట్లు దొరక్కపోవడం విషాదకరం. జిల్లాలోని 20 మం డలాల్లో 20 కస్తూర్బా పాఠశాలలు, విద్యార్థులను బట్టి ౧౧ ఇంటర్ కస్తూర్బాలు ఉన్నాయి. పాఠశాల విద్యార్థులు 20 వేలు, కళాశాల విద్యార్థులు 1,180 మందికి పైగా చదుతున్నారు.
సామాన్యులకు దక్కని కస్తూర్బా సీటు
తల్లిదండ్రులు లేని అనాథలు, అత్యంత బీదరికంలో ఉన్న పిల్లలకే కస్తూర్బా సీటు దక్కడం లేదు. కొంతకాలంగా ఇంగ్లిష్ మీడియంతోపాటు నాణ్యమైన విద్య అందు తున్న కస్తూర్బాల్లో కార్పొరేటుకంటే మంచి ఫలితాలు వస్తుండటంతో ఆర్థికంగా ఉన్నవారు కూడా తమ పిల్లలను కస్తూర్బాల్లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో పాఠశాలలో 200 మందికి మాత్రమే అవకాశం ఇవ్వడంతో ఇప్పుడు ప్రతి పాఠశాలలో వందల మంది విద్యార్థుల తల్లిదండ్రులు సీటు దొర క్క వెనుదిరుగుతున్నారు. కొందరు పైరవీకారులను ఆశ్రయించి సీట్లు సంపాదిస్తున్నారు. ఆర్థికంగా లేనివారు, అనాథ పిల్లలు మాత్రం ఇండ్లకే పరిమితం అవుతున్నారు.
తప్పుచేస్తే కఠిన చర్యలు
కస్తూర్బా పాఠశాలలో మేలైన విద్యతోపాటు భద్రత ఉం టుందని భావించే తల్లిదండ్రులు ఎలాగైనా సీటు పొందాలని భావిస్తున్నారు. అయితే, దారిద్య్ర రేఖకు దిగువన ఉండేవారినే పాఠశాలల్లో చేర్పించుకోవాలని సూచించాం. పైరవీకారులను నమ్మి ఎవరూ మోసపో వద్దు. అనాథ పిల్లలను తప్పనిసరిగా చేర్చుకోవాల్సిందే. డబ్బులు తీసుకునేవారిపై దృష్టిపెడతాం. తప్పులు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం.
డీఈవో, నాగర్‌కర్నూల్