04-04-2025 01:09:30 PM
ఏఎస్పి చిత్తరంజన్
కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయక్రాంతి): పలు సంఘటనలో రౌడీ షీటర్, సస్పెక్టివ్ కేసులు నమోదైన వారు సత్ప్రవర్తన మారినప్పటికీ ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్న వారి పై ఉన్న కేసులను రద్దు చేయడం జరిగిందని ఏఎస్పి చిత్తరంజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రౌడీ షీటర్, సస్పెక్టివ్ కేసులు రద్దు చేసిన వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రతిరోజూ రౌడీషీటర్స్, సస్పెక్టివ్ వ్యక్తులపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. పరివర్తన మారి 10 సంవత్సరాలు పైబడిన వారి కేసులను రద్దు చేయడంతో పాటు దివ్యాంగులు, వయసు పైబడిన వ్యక్తులపై ఉన్న కేసులను సైతం రద్దు చేయడం జరుగుతుందన్నారు.
జిల్లాలో 67 మంది పై ఉన్న కేసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కేసులు పరిష్కరించడంతోపాటు తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుందని వివరించారు. కేసు రద్దు అయిందని మరోసారి తప్పు చేస్తే ఏమీ కాదు అనుకోవడం పొరపాటు అన్నారు. మీపై నమ్మకంతో స్థానిక పోలీసులు కేసుల పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని అది గుర్తుంచుకొని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని సూచించారు.
మీరు ఏదైనా తప్పు చేస్తే కేసు పరిష్కారంలో సహకరించిన పోలీసులు కూడా ఇబ్బందుల పాలు అవుతారని అన్నారు. కేసు రద్దు అయిన పలువురి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా జరిగిన సంఘటనల నేపథ్యంలో కేసు నమోదయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు రద్దు చేయడంతో ఏ ఎస్పి కి, సంబంధిత పోలీసు అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు రవీందర్, బుద్దే స్వామి, సత్యనారాయణ, ఆయా పోలీస్ స్టేషన్ ల ఎస్సైలు పాల్గొన్నారు.