09-03-2025 08:48:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ మెగా లోక్ అదాలత్ లో మొత్తం 2274 కేసులు పరిష్కారం జరిగిందని రాజీమార్గమే రాజ మార్గమని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న వివిధ పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపిసి కేసులు 257, డ్రంక్ అండ్ డ్రైవ్, ఎంవీ యాక్ట్ కేసులు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు 1797, పరిష్కరించబడ్డాయని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిటి కేసులు, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన, తదితర పిటి కేసులు 220 అన్ని కలుపుకొని 2274 కేసులు పరిష్కరించబడినాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినట్లు తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.