* కంగుతిన్న మహారాష్ట్ర
* చిన్నారులు, వృద్ధులే టార్గెట్
* నిఘా పెంచాలన్న కేంద్రం
న్యూఢిల్లీ, జనవరి 7: భారత్‌లో హెచ్‌ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) వైరస్ కోరలు చాస్తోంది. మహారాష్ట్రలో కూడా ఇద్దరు చిన్నారులకు సోకడంతో కేసుల సంఖ్య 7కు చేరుకుంది. నాగ్‌పూర్ పట్టణంలో ఇద్దరు చిన్నారులు (7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు) ఈ వైరస్ బారిన పడ్డారు. చిన్నారులకు దగ్గు, జ్వరం ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లగా వై ద్యులు పరీక్షలు చేసి హెచ్‌ఎంపీవీ వైరస్ సోకినట్లు నిర్దారించారు. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ వెలుగు చూసింది.
మహా ఆరోగ్య శాఖ అప్రమత్తం
రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు హెచ్‌ఎంపీవీ వైరస్ బారిన పడటంతో మహారాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. దగ్గు, జ్వరం వంటి తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న వారి విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేసింది.
త్వరలోనే తీసుకోవాల్సిన జా గ్రత్తలకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేస్తామంది. నాగ్‌పూర్‌లో కేసులు వెలుగుచూడటంతో ఆరోగ్య శాఖ మంత్రి అబీత్కర్ అత్యవసరంగా సమావేశం నిర్వహించారు.
సమీక్ష నిర్వహించిన ఆరోగ్య సెక్రటరీ..
యూనియన్ హెల్త్ సెక్రటరీ అపూర్వ చంద్ర మంగళవారం రోజు ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘శ్వాస కోస రోగుల పెరుగుదల అనేది కనిపించలేదు. ప్రస్తుత పరిస్థితి గురించి నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.
ఇదేం కొత్త వైరస్ కాదు..
హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదు. ఇది 2001 నుంచే ఉనికిలో ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెంది ఉంది. అనే క మంది ఆరోగ్య నిపుణులతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా కూడా ఇదే విష యం స్పష్టం చేశారు.
సప్పుడు చేయని చైనా..
హెచ్‌ఎంపీవీ వైరస్ వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్నా కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం సైలెంట్‌గా ఉంది. హెచ్‌ఎంపీవీ గురించి ఇప్పటి వరకు మీడియా ముందు నోరు విప్పని చైనా దేశంలో శ్వాసకోస వ్యాధులపై నిఘా పెంచింది.
నిఘా పెంచండి: కేంద్రం
భారత్‌లో ఏడు హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగుచూడటంతో కేంద్రం అలర్ట్ అయింది. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్వాసకోస వ్యాధులతో బాధపడే వారిపై నిఘాను పెంచాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాధి సోకిన వ్యక్తుల నమూనాలను నాగ్‌పూర్‌లో ఉన్న ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్‌కు, పూనేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతున్నారు.
చైనా బాటలోనే డబ్ల్యూహెచ్‌వో..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా హెచ్‌ఎంపీవీ వైరస్ మీద ఇంత వరకు ఎటువంటి ప్రకటనా చేయలేదు. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కం ట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) కూడా ఈ పరిస్థితిపై కా మ్‌గా ఉంది. ఈ వైరస్ వల్ల మరో మహమ్మారి విపత్తు ఏం రాదని పలువురు నిపుణులు చెబుతున్నారు.