29-04-2025 12:25:33 AM
ఖమ్మం, ఏప్రిల్ 28( విజయక్రాంతి ):-రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా పోలీసు యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు రోజుల్లో దాదాపు 31 మంది మైనర్ డ్రైవింగ్, 266 డ్రంకన్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులు, వెహికల్ ఓనర్లపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.
స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోను వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.మైనర్లు యాక్సిడెంట్ చేసి ఎదుటి వ్యక్తి చనిపోతే, అతడికి బైక్ ఇచ్చిన యజమానికి 3 ఏండ్ల జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు.ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని అన్నారు.ఈ ఏడాది మూడు నెలలలో 243 రోడ్డు ప్రమాదాలు జరిగితే ..84 మంది మృతి చెందారని,మరో 686 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయని కమీషనర్ పేర్కొన్నారు.