02-04-2025 10:11:19 PM
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రోడ్డుపై న్యూసెన్స్ సృష్టించిన యువకులపై కేసు నమోదు చేసినట్లు బుధవారం నాడు ఎల్లారెడ్డి ఎస్ఐ మహేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డి బాన్సువాడ ప్రధాన రహదారిపై డీఎస్పీ కార్యాలయం సమీపంలో మంగళవారం రాత్రి ఓ యువకుని పుట్టినరోజు వేడుకను రోడ్డుపై బైక్ పెట్టి బైక్ పై ఉంచిన కేకును కట్ చేస్తూ కేరింతలు పెడుతూ ఆ మార్గంలో వెళ్లే వారికి ఆటంకం కలిగించే విధంగా న్యూసెన్స్ చేశారని, వారి వద్ద బీరు సీసాలు లభించాయని, ఘటనా స్థలంలో ఉన్న కొంతమంది యువకులను అదుపులోకి తీసుకొని న్యూసెన్స్ కేసు నమోదు చేశామని ఎస్సై మహేష్ తెలిపారు. మరునాడు ఆ యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించామని అన్నారు. ఎవరైనా ఇలాంటి వేడుకలతో రోడ్లపై న్యూసెన్స్ సృష్టిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.