27-03-2025 05:43:52 PM
8 మంది అరెస్ట్, ముగ్గురు పరారి..
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజీవ్ చంద్ర..
మాల్ ప్రాక్టీస్ యత్నాన్ని భగ్నం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి, పోలీసులు
అభినందించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కొడుకుని పరీక్షలో గట్టెక్కించేందుకు ప్రయత్నించిన తండ్రి కటకటాల పాలు
కామారెడ్డి, మార్చి 27 (విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన కేసులో 11 మందిపై కేసు నమోదు చేయగా 8 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాల్ ప్రాక్టీస్ కు యత్నించిన కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుధవారం గణిత పరీక్ష నిర్వహిస్తుండగా పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి తండ్రి తన కుమారుడు గణితంలో వీకున్నాడనే ఉద్దేశంతో మాల్ ప్రాక్టీస్ చేయించేందుకు ప్రయత్నించగా విద్యాశాఖ అధికారులు అడ్డుకొని పోలీసులకు తెల్పడంతో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పి పేర్కొన్నారు.
వారిలో 8 మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాల పరీక్ష కేంద్రంలో గణితం పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థికి గణితం సబ్జెక్టు సరిగ్గా రాదు. దీంతో విద్యార్థి తండ్రి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కంటాలి గ్రామానికి చెందిన జాదవ్ సంజీవ్ జుక్కల్ ఉన్నత పాఠశాలలో వాటర్ సప్లయ్ చేస్తున్న సయ్యద్ మొబిన్ అనే వ్యక్తిని మాటలతో మచ్చిక చేసుకున్నాడు. అతనికి ఓ తెల్ల కాగితం ఇచ్చి తన కొడుకు వివరాలు చెప్పి ప్రశ్నలను రాసుకుని రావాలని పంపించాడు. తెల్ల కాగితాన్ని మోబిన్ అనే వ్యక్తి విద్యార్థికి ఇచ్చాడు. కాసేపటికి 5 ప్రశ్నలతో కూడిన కాగితాన్ని ఆ విద్యార్థి సదరు వ్యక్తి మోబిన్ కు అందించాడు.
అతను ఆ కాగితాన్ని తిరిగి విద్యార్థి తండ్రి సంజీవ్ కు ఇచ్చాడు. అనంతరం విద్యార్థి తండ్రి సంజీవ్ ఆ పేపర్‌ను జుక్కల్ గ్రామ పంచాయతీ కారోబార్ కామ్దే మనోజ్ కు ఇచ్చి జవాబులు తేవాలని చెప్పాడు. ఆ పేపర్‌ను ఫొటో తీసుకున్న కారోబార్ మనోజ్ అక్కడే ఉన్న ఓ విలేకరి హనుమాడ్ల కు పంపించాడు. అలాగే ఆ పేపర్ కారోబార్ మనోజ్ నుంచి ఓ యూట్యూబ్ రిపోర్టర్ భాను కు చేరగా అతని నుంచి మరో రిపోర్టర్ గంగ దర్ కు వాట్సాప్‌లో పంపారు. సదరు విలేకరి గంగాధర్ ఆ పేపర్‌ను ఓ క్లిప్పింగ్ తయారు చేసి లోకల్‌గా ఉన్న డిజిటల్ మీడియా గ్రూపులో షేర్ చేశాడు. తర్వాత ఓ మైనర్ బాలుడు పరీక్ష కేంద్రానికి వెళ్లి మరొక మైనర్ బాలుడి ఫోన్ నుంచి ప్రశ్నలతో కూడిన పేపర్‌ను ఫొటో తీసి కారోబార్ మనోజ్ కు పంపించి డిలీట్ చేశారు.
పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి ప్రశ్నలు బయటకు వెళ్లకుండా విచారణ చేపట్టి ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఆరుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసినట్లు మరో ఇద్దరు మైనరులను జ్యు వైనల్ కోర్టుకు పంపినట్లు ఎస్పి రాజీవ్ చంద్ర వెల్లడించారు. కాగా ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరి భాను తో పాటు వాట్సప్ గ్రూప్ అడ్మిన్ నయీమ్ ఖాన్, మరో మైనర్ బాలుడు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా పదవ తరగతి పరీక్ష లో మాల్ ప్రాక్టీస్ ను అడ్డుకున్నందుకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు జుక్కల్, బిచ్కుంద పోలీస్ అధికారులను సిబ్బందిని ఎస్పి రాజేష్ చంద్ర అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్బీ సీఐ తిరుపతి పాల్గొన్నారు.