- డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో నాంపల్లి కోర్టు ఆదేశాలు
- వెంకటేశ్ కుటుంబ సభ్యులపై కూడా కేసు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 12(విజయక్రాంతి): సంక్రాంతి వేళ టాలీవుడ్ సినీనటుడు వెంకటేశ్, ఆయన కుటుంబసభ్యులకు ఊహించని షాక్ తగిలింది. ఫిల్మ్‌నగర్‌లోని డక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో వెంకటేశ్‌తో పాటు ఆయన సోదరుడు దగ్గుబాటి సురేష్‌బాబు, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి అభిరామ్‌పై ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపాలని నాంపల్లి కోర్టు శనివారం ఫిల్మ్‌నగర్ పోలీసులను ఆదేశాలిచ్చింది. కేసు వివరాలిలా ఉన్నాయి. నందకుమార్ అనే వక్తికి చెందిన డక్కన్ కిచెన్ హోటల్ వ్యవహారంలో వెంకటేశ్ కుటుంబంతో స్థల వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 2022 నవంబర్‌లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆహోటల్‌ను పాక్షికంగా ధ్వంసం చేశారు.
ఈ అంశంలో కోర్టు స్టేటస్‌కోను విధించడంతోపాటు, సదరు స్థలంలో ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను లెక్కజేయకుండా గతేడాది జనవరిలో వెంకటేశ్ కుటుంబం హోటల్‌ను పూర్తిగా కూల్చివేయించింది. దీంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. వారిపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై నాంపల్లి కోర్టు శనివారం ఆదేశాలిచ్చింది. కాగా ఇటీవల టాలీవుడ్ హీరోలపై వరుస కేసుల నేపథ్యంలో వెంటకేశ్ కేసులో ఏం జరుగుతోందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.