హైదరాబాద్,(విజయక్రాంతి): సినీనటుడు దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 448, 452, 458, 120(బి)ల కింద సినీ నిర్మాత సురేష్ బాబు, నటులు వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, అభిరామ్‌లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అక్రమ కూల్చివేత, ఆస్తి దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై నందకుమార్ ఫిర్యాదు చేశారు.
సిటీ సివిల్ కోర్టు నుండి పెండింగ్‌లో ఉన్న ఇంజక్షన్, తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, డి. సురేష్ బాబు (A1) వెంకటేష్ దగ్గుబాటి (A2) సహా నిందితులు చట్టవిరుద్ధంగా ఆస్తులలోకి ప్రవేశించి సామాజిక వ్యతిరేక శక్తుల సహాయంతో నష్టం కలిగించారని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. బౌన్సర్లతో కలిసి హోటల్‌ను 2022లో జీహెచ్ఎంసీ సిబ్బంది పాక్షికంగా కూల్చివేశారు. 2022లో నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు సుమారు రూ. 20 కోట్ల విలువైన ఆస్తిని దోచుకుని, నష్టపరిచారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. 13 నవంబర్ 2022 ఆ తర్వాత తేదీలలో తదుపరి కూల్చివేతను ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు.
నిందితులు ఫిర్యాదుదారు సిబ్బందిని బెదిరించి దాడి చేశారని వాపోయ్యారు. జనవరి 2024లో దగ్గుబాటి కుటుంబం హోటల్ ను కూల్చివేసింది. దీంతో నందకుమార్ అతిక్రమణ, నేరపూరిత కుట్రతో సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద దర్యాప్తు కోరుతూ మళ్లీ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. శనివారం నందకుమార్ పిటిషన్ ను సమీక్షించిన నాంపల్లి కోర్టు దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిల్మ్‌నగర్ పోలీసులకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ఉల్లంఘినపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.