calender_icon.png 22 November, 2024 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీపై కేసు నమోదు

22-11-2024 02:48:07 AM

  1. ఢమాల్ అన్న గ్రూపు షేర్లు 
  2. లంచాలు ఇస్తూ మేనేజ్ చేశారని ఆరోపణలు

* అపరకుబేరుడు అదానీకి ఊహించని షాక్ తగిలింది. హిండెన్‌బర్గ్ ఆరోపణల నుంచి గట్టెక్కిన అదానీ గ్రూప్ కంపెనీలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రీన్ ఎనర్జీ భారత్‌లోని అధికారులకు లంచాల ఎర చూపి పనులు చేయించుకున్నట్లు ఆరోపిస్తూ అమెరికాలో కేసు నమోదు చేశారు. ఈ దెబ్బతో అదానీ గ్రూపు కంపెనీలు పాతాళానికి పడిపోయాయి. ఒక్క రోజే అదానీ దాదాపు రూ. లక్ష కోట్ల సంపదను కోల్పోయారు.

గతేడాది ఆరంభంలో అమెరికన్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ అదానీ గ్రూపు కంపెనీల మీద తీవ్ర ఆరోపణలు చేయడంతో అప్పుడు కూడా అదానీ సంస్థల మీద అందరికీ అనుమానం కలిగింది. కాగా ఇప్పడు మరోమారు అమెరికాలో లంచం ఆరోపణలు రావడం, కేసులు కూడా నమోదు కావడంతో అదానీ కంపెనీల విశ్వసనీయత మీద మరో మారు మదుపర్లకు అనుమానాలు మొదలయ్యాయి. 

  1. భారీగా పతనమైన అదానీ గ్రూప్
  2. అరెస్ట్ వారెంట్ జారీ
  3. ఖండించిన కంపెనీ
  4. రాజకీయ దుమారం 
  5. జేపీసీకి పట్టుబడుతున్న ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు, భారత బిజెనెస్‌మెన్ గౌతమ్ అదానీపై కేసు నమోదైంది. రాబోయే 20 ఏండ్లలో 2 బిలియన్ అమెరికన్ డాలర్ల లాభాలు పొందేందుకు అధికారులకు లంచాల ఎర వేసి పనులు చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు.

దీనిపై అదానీ సమీప బంధువు సాగర్ అదానీతో పాటు గౌతమ్ అదానీ మీద కూడా అమెరికాలో కేసు నమోదైంది. అదానీ గ్రూపు 265 మిలియన్ల డాలర్ల మేర అధికారులకు లంచాల ఎర వేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. తద్వారా 2 బిలియన్ల డాలర్ల మేర లాభాలు పొందేందుకు ప్లాన్ చేసినట్లు వారు ఆరోపణలు గుప్పించారు.

భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను కలిగి ఉన్న అదానీ ఇలా ఎన్నో కుట్రలకు తెరతీసినట్లు వారు ఆరోపించారు. అవినీతి చేస్తూ పొందిన ఈ బాండ్ల ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈవో వినీత్ జైన్  3 బిలియన్ డాలర్ల లోన్లు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. 

కొంత మంది గౌతమ్ అదానీని “న్యూమెరో యునో”, “బిగ్ మ్యాన్‌” అనే కోడ్‌ల ద్వారా సంబోధించినట్లు కూడా వెల్లడైంది. సాగర్ అదానీ తన సెల్‌ఫోన్ ద్వారా లంచాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసినట్లు తెలిసింది. లంచాలు ఇచ్చారనే దానితో పాటు ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్, యూఎస్ అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. 

పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం.. 

గౌతమ్ అదానీ కంపెనీలు ఇక్కడ అధికారులకు లంచాల ఎర వేసి అక్రమంగా వ్యవహరించడంతో పాటు అమెరికాతో పాటు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు తప్పుడు పత్రాలు సమర్పించి వారి నుంచి పెట్టుబడులు పొందాయని కూడా ప్రాసిక్యూటర్లు ఆరోపణలు గుప్పించారు. ఈ కేసులు, ఆరోపణల నుంచి అదానీ కంపెనీ ఎలా బయటపడుతుందో..  

అందుకే అమెరికా దర్యాప్తు.. 

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీపై అభియోగాలు రావడం అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు కావడంతో అమెరికన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఈ గ్రూపులో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో ఆ దేశం దర్యాప్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది.

అమెరికా ఆరోపణల నేపథ్యంలో కెన్యా అదానీ గ్రూప్‌తో నిర్మించబోయే పవర్ ప్రాజెక్టు డీల్‌ను రద్దు చేస్తున్నట్లు అలాగే కెనడా ప్రధాన విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్‌కు అప్పగించాలనే నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు కెనడా ప్రధాని రూటో తెలిపారు. 

చదువు మధ్యలోనే ఆపేసి 

62 సంవత్సరాల అదానీ పోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం చూసుకుంటే 69.8 బిలియన్ అమెరికన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో పుట్టిన అదానీ పేరు గత 10 సంవత్సరాలకు ముందు పెద్దగా వినిపించలేదు. కానీ గత కొద్ది రోజులుగా ప్రతిపక్షాలు అదానీ మీద జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) వేయాలని పట్టుబడుతున్నాయి.

ఇంత సంపాదించిన అదానీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఆ తర్వాత 1988లో అదానీ గ్రూప్‌ను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ 2023లో అదానీ గ్రూప్ అవకతవకలపై ఆరోపణలు చేసిన తర్వాత మరలా అదానీ గ్రూప్ మీద వచ్చిన పెద్ద ఆరోపణ ఇదే కావడం గమనార్హం.