calender_icon.png 10 March, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు

09-03-2025 08:35:42 PM

హయత్ నగర్ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్.. 

బాధితులకు మరిచిపోయిన ఆభరణాల బ్యాగ్ అందజేత...

ఎల్బీనగర్: ఫ్రెండ్లీ పోలీసింగ్ కు హయత్ నగర్ పోలీసులు నిదర్శనంగా నిలిచారు. ఆటోలో మర్చిపోయిన విలువైన ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగు తిరిగి అప్పగించారు. హయత్ నగర్ సీఐ నాగరాజు గౌడ్ తెలిపిన వివరాలు... వీరసత్యమల్లేశ్, భార్య సుష్మతో కలిసి, ఈ నెల 8వ తేదీన ఉదయం 5:30 గంటలకు ఆంధ్రా నుంచి హైదరాబాద్ లోని హయత్ నగర్ డివిజన్ సూర్యానగర్ కాలనీలో నివాసముంటున్న స్నేహితుడు శరత్ చంద్ర ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో హయత్ నగర్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర బస్సు దిగి అక్కడ నుంచి లోకల్ ఆటోలో సూర్యానగర్ కాలనీకి వెళ్లారు. కాగా, శరత్ చంద్ర ఇంటికి వెళ్లిన తర్వాత సామగ్రిని తనిఖీ చేయగా, ఆటోలో హ్యాండ్ బ్యాగును మర్చిపోయినట్లుగా గుర్తించారు.

వెంటనే ఆటో గురించి వెతకగా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశారు. వెంటనే హయత్ నగర్ క్రైమ్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించి డ్రైవర్ బుక్యా నాగేశ్వర రావును గుర్తించారు. ఆటోలో తనిఖీ చేయగా హ్యాండ్ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. బ్యాగ్ లో ఉన్న బంగారు ఆభరణాలు (జత కమ్మలు), ఒక జత బ్లాక్ బీట్స్ చైన్, రెండు లాకెట్ చైన్లు, ఒక పాపిటబిళ్ళతో పాటు రూ.14వేల నగదు, ఒక విలువైన వాచ్ ఉన్నాయి. బాధితులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ ను హయత్ నగర్ పోలీసులు తిరిగి అప్పగించారు. తక్కువ సమయంలో తమ బ్యాగ్ ను అందజేసిన హయత్ నగర్ పోలీసులను బాధితులతో పాటు సూర్యానగర్ కాలనీవాసులు కృతజ్ఞతలు చెప్పి, అభినందించారు.