మహబూబ్ నగర్,(విజయక్రాంతి): గడిచిన రెండు రోజుల క్రితం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపిన ఘటనలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వన్ టౌన్ పీఎస్ లో కేసు నమోదు అయింది. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరద భాస్కర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రభుత్వంపై ఇష్టానుసారంగా తప్పుడు పోస్టులను పెడుతున్నారని తమ దృష్టికి రావడం జరిగిందని తెలిపారు. దీంతో వరద భాస్కర్ ను పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.
ఈ క్రమంలో అతను అసభ్యకరంగా పెట్టిన పోస్టులకు సంబంధించి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గత రెండు రోజుల క్రితం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి కొంతమందితో కలిసి నిరసన చేయడంతో, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఈ నిరసన కాదని, చెప్పడం జరిగిందని ఈ విషయంలో మాజీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు చేసినట్లు సిఐ అప్పయ్య తెలియజేశారు.