ఖాజాగూడ భగీరథమ్మ చెరువు శిఖం కబ్జాకు యత్నం
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు
శ్రీధర్ రావు పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు శిఖం స్థలంలో కొందరు వ్యర్థాలను పోసి చెరువును పూడుస్తున్న వారిపై ఇరిగేషన్ అధికారులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన రాయదుర్గం పోలీసులు మట్టిపోసి చదును చేస్తున్నవారిని, జేసీబీ ఓనర్ నరేశ్ ను అరెస్ట్ చేశారు. దాదాపు 700 గజాల స్థలాన్ని మట్టితో నింపినట్లు గుర్తించారు.
సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్రావు డైరెక్షన్ లోనే చెరువు శిఖం స్థలం కబ్జా చేస్తున్నారని తెలుసుకున్నారు. ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ బి.శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు సంధ్యా కన్వెన్షన్ ఎండీ. శ్రీధర్ రావు, వెంకటేశ్వర రావు, సుంకర వీర వెంకట సత్యనారాయణ మూర్తి, మణికంఠ అనే వ్యక్తులపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదు
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సంధ్యా కన్వన్షన్ శ్రీధర్ రావుపై మరో కేసు నమోదైంది. తమ స్థలంలోని ఇళ్లను శ్రీధర్ రావు కూల్చివేయించాడని పేర్కొంటూ బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలిసులు బాధితుల ఫిర్యాదు మేరకు శ్రీధర్ రావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.