calender_icon.png 26 March, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రేపై కేసు

26-03-2025 12:02:11 AM

నటులు సూరజ్, డినో మోరియాపై కూడా..

ముంబై: మహిళ అనుమానాస్పద మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురిపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని మృతురాలి తరఫు న్యాయవాది నీలేశ్ ఓఝా మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం బాలీవుడ్ స్టార్ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా శాలియన్ భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత సుశాంత్‌సింగ్ తన ఫ్లాట్‌లో శవమై కనిపించాడు. అప్పట్లో ఈ కేసు పెద్ద దుమారం రేపింది. అప్పుడు అధికారంలో ఉన్న  ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసును మసిపూసి మారేడు కాయ చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

దిశా మృతిపై తాజాగా ఆమె తండ్రి సతీశ్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 2020 జూన్ 8న తన కుమార్తె ఓ పార్టీ నిర్వహించిందని, ఆ పార్టీకి ఆదిత్య ఠాక్రేతో పాటు అతడి బాడీగార్డులు, సినీ నటులు సూరజ్ పంచోలీ, డినోమోరియా తదితరులు హాజరయ్యారని పేర్కొన్నాడు. వీరంతా తన కుమార్తెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద  ఉన్నాయంటూ ముంబై  హైకోర్టును ఆశ్రయించాడు. ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాజాగా ఆదిత్య ఠాక్రే, సూరజ్ పంచోలీ, డినో మోరియాతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి.