పలువురు పోలీసులపైనా చర్యలకు రంగం సిద్ధం
విజయవాడ, సెప్టెంబర్ 14: తనను అక్రమంగా నిర్బంధించి, చిత్రహింసలకు గురి చేశారని ముంబై నటి కాదంబరి జత్వానీ తన తల్లిదండ్రులు, లాయర్లతో కలిసి శుక్రవారం ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కంప్లుంట్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వైకాపా నేత కుక్కల విద్యాసాగర్‌తో పాటు మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి జత్వానీ శనివారం సైతం ఇబ్రహీపట్నం స్టేషన్‌కు వచ్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ముంబై నటి కేసులో రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై ఇదివరకే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్య నారాయణలను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు. జత్వానీ కేసు తర్వాత బదిలీల్లో భాగంగా హనుమంతరావు కాకినాడ డీఎస్పీగా వెళ్లారు. అయితే జత్వానీ పోలీసుల అదుపులో ఉన్న టైంలో మళ్లీ స్పెషల్‌గా విజయవాడకు వచ్చి ఆమె ఇంటరాగేషన్‌లో కీలకంగా వ్యవహరించారు.
ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కేసు పూర్వపరాలను పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారని జత్వానీపై కేసు నమోదు చేసి ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి అన్నీ తామై వ్యవహరించిన ఐపీఎస్‌లు పీ.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపోమాపో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు.