సెబీ తాజా ఉత్తర్వులు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), ఈ ఎక్సేంజ్ మాజీ ఛీఫ్ చిత్రా రామకృష్ణ, రవినారాయణ్, ఇతర ఎక్సేంజ్ మాజీ ఉద్యోగులపై నియంత్రణా ఉల్లంఘన కేసును మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొట్టివేసింది. నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్సేంజ్ కో లొకేషన్ సదుపాయాన్ని దుర్వినియోగం చేశారంటూ 2019లో వీరిపై సెబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో తగిన సాక్ష్యాధారాలు లభించనందున, కేసును ఉపసంహరించు కుంటున్నట్టు సెబీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
డార్క్ ఫైబర్ మార్గంలో కొన్ని బ్రోకరేజ్ సంస్థలకు ముందుగా మార్కెట్ యాక్సెస్‌ను కల్పించారన్నది వారిపై ప్రధాన ఆరోపణ. మార్కెట్ ట్రేడింగ్ మొదలైన సమయంలో తొలుత ఈ బ్రోకరేజ్ ఆర్డర్లే ఎన్‌ఎస్‌ఈ సర్వర్‌లోకి వెళ్లేలా ఈ డార్క్ ఫైబర్ నెట్‌వర్క్ ఎన్‌ఎస్‌ఈ అధికారులు ఉపయోగించారని అప్పట్లో సెబీ ఆరోపించింది. ఎన్‌ఎస్‌ఈతో పాటు ఈ ఎక్సేంజ్ మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ, సీఈవో రవి నారాయణ్‌లతో పాటు ఎన్‌ఎస్‌ఇ ఇతర మాజీ అధికారులు ఆనంద్ సుబ్రమణియన్, అరవింద్ ఆప్టే, ఉమేశ్ జైన్, మహేశ్ పార్కర్, దేవీ ప్రసాద్ సింగ్‌లపై సెబీ ఆరోపణల్ని తాజాగా ఉపసంహరించుకుంది.